TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే.. వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు కొందరు నేతలు. ఇదిలా ఉంటే అభ్యర్థుల జాబితా టీడీపీ నేతల్లో కాస్త కలవరపెడుతోంది. ఇదే అదనుగా భావించిన వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. మొన్న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మ్యానిఫెస్టోపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు మ్యానిఫెస్టో సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్దం సభలను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ నాలుగో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ట జిల్లా మేదరమిట్లలో జరిగే సిద్దం భారీ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఈ సభలోనే వైసీపీ రూపొందించిన కొత్త మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తాజాగా మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే సిద్దం సభకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. మార్చి 10న జరిగే మేదరమిట్ల సభలో దాదాపు 15లక్షల మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెబుతున్నారు. దీనికి తగ్గ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గత నాలుగు సంవత్సరాల 10 నెలల్లో ఏం చేశారు.. రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నారన్న దానిపై సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, టీడీపీ ఎప్పుడూ బీసీలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. మార్చి 10న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ కూడా ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ కొన్ని పథకాలను వెల్లడించింది. అయితే టీడీపీ ప్రవేశపెట్టినవి వైసీపీ ప్రవేశపెట్టబోయేవి ఒకేలా ఉంటాయా భిన్నంగా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.