TRINETHRAM NEWS

Trinethram News : ఊరూరా గులాబీ దళం.. సంస్థాగత నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ దృష్టి

హైదరాబాద్‌, జనవరి 4 సంస్థాగత నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీ సమీక్షలు పూర్తయిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొనే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారిస్తామని
కేటీఆర్‌ తెలిపారు.

గురువారం తెలంగాణభవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేటీఆర్‌తోపాటు మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు, కాంగ్రెస్‌, బీజేపీకి పోలైన ఓట్ల వివరాలను విశ్లేషించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన సమావేశంలో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలం, బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఉదయం ప్రారంభమైన సమావేశంలో కే కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌ ప్రసంగించారు.

కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు, కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజల్లో సృష్టించిన అపోహలు, చేసిన అసత్యప్రచారాలు, అధికారంలోకి రాగానే హామీల అమలులో చేస్తున్న జాప్యం, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై చర్చించారు. మధ్యా హ్న భోజన విరామం అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి వారి ప్రాంతాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు. కొంతమంది పార్టీ నేతలే పట్టించుకోకపోవడం, కొంతమంది అభిప్రాయాలనే వినడం వంటి అంశాలు పార్టీకి ఏవిధంగా నష్టం చేశాయో వివరిస్తూ వారి అనుభవాలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల్లో కేసీఆర్‌ పట్ల, కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఉన్న ఆదరణను ఉదహరణలతో వివరించారు. అనంతరం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అనేక దశాబ్దాలు పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒకే ఒక్క వజ్రసంకల్పంతో పార్టీ అధినేత కేసీఆర్‌ వ్యవహరించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గులాబీ శ్రేణులకు సోదాహరణంగా వివరించారు. ప్రజల యోగక్షేమాలే పరమావధిగా కేసీఆర్‌ సర్కార్‌ పనిచేసిందని చెప్పా రు. ప్రజాప్రయోజనాలే కేంద్రంగా కేసీఆర్‌ పాలన సాగించారని, ఒక్కో పథకం లబ్ధిదారుల ఎంపిక, వారికి చేకూరే ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరాలన్న దృఢ సంకల్పంతో ముం దుకు సాగారని వివరించారు. అయితే పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవాల్సిన స్థాయిలో పట్టించుకోలేకపోయామని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌పై అన్ని పక్షాలు ఏకమై చేసిన దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోయామన్నారు. ప్రభుత్వ పథకాల్లో పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయలేకపోయామని, ఫలితంగా పార్టీకి, ప్రజలకు మధ్య వారధి లేకుండా పోయిందని చెప్పారు.

తెలంగాణ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తున్నదని, దీనిని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన గురుతర బాధ్యత బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులపై ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది. కేవలం కేసీఆర్‌పైన వ్యతిరేకతతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదని పేర్కొన్నది. బీజేపీని అనేక స్థానాల్లో ఓడించింది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌, సోయం బాపురావులను ఓడగొట్టింది బీఆర్‌ఎస్‌ అనే విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తించుకోవాలని స్పష్టంచేసింది. తమను బీజేపీకి బీ టీం అంటూ సాగించిన దుష్ర్పచారాన్ని ఈ ఫలితాల ద్వారా ప్రజల ముందు ఎండగట్టాలని సూచించింది.

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనున్నది.

తెలంగాణభవన్‌ గులాబీ శ్రేణులతో కోలాహలంగా మారింది. గురువారం కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతల సమావేశం జరిగింది. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల రిసెప్షన్‌ కౌంటర్లు, ఆయా నియోజవకార్గల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల నమోదు, వారికి కిట్స్‌ అందజేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ‘కాంగ్రెస్‌ 420 హామీలు’, ‘తెలంగాణ స్వేదపత్రం’, కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల వారీగా వచ్చిన ఓటింగ్‌ షీట్‌, పెన్ను, హ్యాండ్‌బుక్‌ను రిసెప్షన్‌లో పార్టీ శ్రేణులకు అందజేశారు.