TRINETHRAM NEWS

పటాన్‌చెరు : నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి పరిశ్రమల గేటుపై మూసివేత పత్రాలు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాలబరస్‌, విఠల్‌ సింథటిక్స్‌, వెంకార్‌ కెమికల్స్‌ పరిశ్రమలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికులు మరణించిన సందర్భాల్లో అనుబంధశాఖలు స్పందించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడను ఎస్పీ రూపేష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన సీఎంహెచ్‌(సాలబరస్‌), అరబిందో, సత్యదేవ, వెంకార్‌, వైటెన్‌, ఇస్నాపూర్‌ చెరువు, మైలాన్‌ పరిశ్రమలను పరిశీలించి భద్రతాచర్యలను తెలుసుకున్నారు. అరబిందో పరిశ్రమలో మాక్‌డ్రిల్‌ ప్రదర్శించారు.

అనంతరం అనుబంధశాఖలు, ఐలా ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచామని ఐలా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ చెప్పారు. సిబ్బందికి ప్రభుత్వాన్ని కోరామని తెలుపగా స్పందించిన కలెక్టర్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో ఎందుకు నిర్వహణ చేయడం లేదని చెప్పారు. సీఎస్‌ఆర్‌ నిధులు తమకు ఇవ్వడం లేదని ఐలా అధ్యక్షుడు చెప్పారు. రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పరిశ్రమల ప్రతినిధులు, అనుబంధశాఖల అధికారులు సభ్యులుగా ఉండాలని వివరించారు. పరిశ్రమల గేట్ల వద్ద.. కార్మికులు, ఉద్యోగులు, ముడిసరకుల వివరాలు బోర్డులపై రాయాలని ఆదేశించారు. రెడ్‌ కేటగిరిలో ఉన్న పరిశ్రమలను తక్షణం మూసివేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ భాస్కర్‌, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐలు ప్రవీణ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నాగరాజు, సుధీర్‌కుమార్‌, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు…