స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ!
Trinethram News : United States : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల మధ్య సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే.
ఈక్రమంలో మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ (Space X)కు చెందిన భారీ స్టార్‌షిప్ రాకెట్‌ను తాజాగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, మస్క్‌లు ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, రాకెట్ ఫస్ట్ స్టేజీలో సాంకేతిక సమస్య రావడంతో లాంచ్‌ప్యాడ్ (లాంచ్ టవర్) తిరిగి రావడంలో విఫలమైంది.
టెక్సాస్‌లో దాదాపు 400 అడుగుల ఎత్తైన రాకెట్‌ను స్పేస్ఎక్స్ ప్రయోగించింది. చంద్రుడిపై వ్యోమగాములు, అంగారకుడి పైకి ఫెర్రీ క్రూను చేర్చేందుకు ఈ రాకెట్‌ను డిజైన్ చేశారు. అయితే, సూపర్ హెవీ అని పిలిచే మొదటి దశలో రాకెట్ లాంచ్‌ప్యాడ్ తిరిగి రావడానికి బదులుగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో పడిపోయింది. దాదాపు 90 నిమిషాల తర్వాత భూమి చుట్టూ తిరిగి వచ్చి హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యింది. ఈ ప్రయోగానికి ముందు తాను స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు వెళ్తున్నట్లు ట్రంప్ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘నేను గ్రేట్ స్టేట్ ఆఫ్ టెక్సాస్‌లో స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ ప్రయోగాన్ని చూడటానికి వెళుతున్నాను. మస్క్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో సహా పలువురు రిపబ్లికన్ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
గత నెలలో స్పేస్ఎక్స్ సంస్థ భారీ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్‌షిప్ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్‌ప్యాడ్ సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి.
ఇక, అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతునివ్వడంతో పాటు ఆయనకు భారీ మొత్తంలో విరాళాలు అందించారు. ఈక్రమంలోనే ట్రంప్‌తో కలిసి ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App