మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య తీవ్రం
మంగళగిరి నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇరుకైన రహదారుల్లో ప్రయాణం ప్రహసనంగా మారుతొంది. తెనాలి రోడ్డు లో ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఓవైపు ఇరుకైన రహదారి మరోవైపు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది చర్యల లోపం వెరసి ఈ ప్రాంతంలో తరచూ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను మిగుల్చుతోంది. తెనాలి రోడ్డు విస్తరణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఆయన వెళ్లిపోయిన తర్వాత మిగిలిన నాయకులు విస్తరణ పై పెద్దగా స్పందించడం లేదు.వారి మాట అధికారులు వినే పరిస్థితి కూడా లేదు.
రోడ్లపై తినుబండారాల స్టాల్స్ కు అద్దెల వసూళ్లు!
మంగళగిరి నగరంలోని గాలిగోపురం ఎదుట రోడ్డు లోని లక్ష్మీనారాయణ గుడి మలుపు నుండి ద్వారకా నగర్ లో ఉన్న బేకరీ వరకు రహదారికి అడ్డుగా వాహనాలను నిలుపుతున్నారు. దుకాణదారులు తమ షాపుల ఎదుట ప్రాంతాన్ని చిరు వ్యాపారులకు అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సాధారణ వాహనదారులు ప్రజల రాకపోకకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది, స్పందించి సమస్య పరిష్కరించాల్సిన సిటీ ప్లానింగ్, పోలీస్ శాఖల అధికారులు ప్రేక్షకు పరిమితం కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సంగతి ఏమిటి?
మంగళగిరి నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సలహాలను స్వీకరించి అమలు చేసేందుకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చారు. ఇంతవరకు ఈ ప్రతిపాదన అమలు కాలేదు. సిసి కెమెరాలు ఏర్పాటు లేదు. దీనివల్ల నిర్లక్ష్యం మరింత పెచ్చు మీరిపోయి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపు చేసింది. రాజధానిగా ఆవిర్భవించిన తరువాత దీనికి తగినట్లుగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిందని స్పష్టంగా చెప్పవచ్చు.