TRINETHRAM NEWS

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా

అమరావతి..

నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి..

ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టినా….తుదిజాబితా పారదర్శకతపై ఇప్పటికీ అనుమానాలు వీడటం లేదు. ఏపీ భవిష్యత్‌ను , నేతల తలరాతలను మార్చే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనుంది. గతేడాది అక్టోబరు 27న విడుదలైన ముసాయిదా జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, నేతలు, ప్రజా సంఘాల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, తమకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు చేర్చడాన్ని వ్యవస్థీకృతంగా కొనసాగించింది. ఓటర్ల జాబితాను వైకాపా జాబితాగా మార్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తుది జాబితా పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయి..

విపక్షాల ఫిర్యాదులతో ఎట్టికేలకు చర్యలకు ఉపక్రమించిన ఎన్నికల సంఘం 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య మొత్తం 21 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. పునఃపరిశీలన అనంతరం వాటిల్లో 13,061 ఓట్లు అర్హమైనవని తేలటంతో వాటిని పునరుద్ధరించింది. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్‌ ఓటర్లు 14.48 లక్షల మంది ఉన్నట్లు ఫిర్యాదులందగా పరిశీలించి 5.65 లక్షల ఓట్లు తీసేసింది. ఒకే డోర్‌ నంబర్‌ చిరునామాతో 10, అంతకు మించి ఓట్లు ఉన్న గృహాలు 1.57 లక్షలు ఉండగా వాటిలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించింది. గతేడాది అక్టోబరు 27న ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఆ గృహాల సంఖ్య 65,964కి, వాటిల్లోని ఓటర్ల సంఖ్య 9.49 లక్షలకు తగ్గించింది. అలాగే సున్నా, అసంబద్ధ సంఖ్యలను డోర్‌ నంబర్లతో 2.52 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించి ఆ చిరునామాలు సరిచేసింది. ముసాయిదా విడుదలకు ముందే లోపాలన్నీ సరిచేశామని ఎన్నికల సంఘం చెబుతున్నా… ముసాయిదా జాబితాలో లెక్కలేనన్ని తప్పులు వెలుగుచూశాయి..