TRINETHRAM NEWS

ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్

ధాన్య సిరిని చూసి మురిసిపోతూ.. అన్నదాత తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్‌ సర్కారు ఈసారి పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసింది.

పండుగపూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్‌ సర్కారు ఒక్క ఎకరాకూ సాగునీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేక కకావికలమవుతున్నది. బరాజ్‌లు ఖాళీ అవడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేక పోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్‌ హాలిడే ప్రకటించగా, ఇప్పుడు గోదావరి బేసిన్‌లోనూ సాగు నీరందడం అనుమానంగా మారడంతో అన్నదాత ఆగమవుతున్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ సాగునీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడు సత్యం బోధపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లేక కాంగ్రెస్‌ ప్రభుత్వం కకావికలమవుతున్నది. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చేందుకు వెనకాముందు ఊగిసలాడుతున్నది. బరాజ్‌లు ఖాళీ అవడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేక పోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్‌ హాలిడే ప్రకటించగా, ఇప్పుడు గోదావరి బేసిన్‌లోనూ సాగునీరందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరుతడికి మాత్రమే
రాష్ట్రంలో గత మూడేండ్లుగా మేజర్‌, మీడియం ప్రాజెక్టుల కిందనే ఏటా దాదాపు 35 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది అది 28 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందులో యాసంగిలోనూ వెట్‌ క్రాప్స్‌కు ఎక్కువగా సాగునీటిని అందించారు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యమిచ్చారు. 2021-22 యాసంగిలో దాదాపు 19.81 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది దానిని 11.57 లక్షల ఎకరాలకు కుదించారు. అదే సమయంలో గత ఏడాది యాసంగిలో కేవలం 13.84 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించగా, ఈ ఏడాది ఏకంగా 17.38 లక్షల ఎకరాలకు విస్తరించారు.

నాగార్జున్‌సాగర్‌ కింద ఆయకట్టు నిల్‌
ఈ ఏడాది కృష్ణా బేసిన్‌కు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 130.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్‌లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా, ఈ యాసంగిలో ఒక్క ఎకరాకూ నీరివ్వడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్‌లో సాగునీరివ్వలేని పరిస్థితి నెలకొన్నది. కేవలం నెట్టెంపాడు కింద 5 వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని అధికారులు ప్రతిపాదించారు.