జేఈఈ పరీక్షపై జోసా కీలక నిర్ణయం.. కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం! కారణం ఇదే
Trinethram News : అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ ఒకటి. జేఈఈ మెయిన్ యేటా రెండు సార్లు నిర్వహించి.. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రెండున్నర లక్షల మందిని మాత్రమే ఎంపిక చేసి అడ్వాన్స్ డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు దక్కుతుంది. ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ సీట్లు పరిమితంగా ఉంటాయి. అందుకే జేఈఈకి పోటీ ఎక్కువ..
జేఈఈ పరీక్షపై జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష పూర్తయిన తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో స్థానిక కౌన్సెలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జోసా పేర్కొంది. జోసా కౌన్సెలింగ్ సాధారణంగా ఆరు రౌండ్ల వరకూ జరుగుతుంది. 2025 నుంచి దీన్ని కూడా కుదించే పనిలో పడ్డారు జోసా అధికారులు. మొత్తం నాలుగు రౌండ్లలోనే పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎక్కువ దశల కౌన్సెలింగ్ వల్ల కూడా విద్యార్థులు ఆప్షన్ల ఎంపిక, అంతర్గత స్లైడింగ్ విధానంలో ఇబ్బంది పడుతున్నట్టు గత రెండేళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక అడ్వాన్స్‌డ్ పరీక్ష కాఠిన్యాన్ని కూడా కొంత సరళించే యోచనలో ఉన్నారు. అత్యంత కఠినం, కఠినం, సాధారణ ప్రశ్నల్లో.. అత్యంత కఠినం స్థాయిని కొంతమేర తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్ష జనవరి 22 నుంచి 31 వరకు, రెండో దశ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 2 లక్షలకుపైగా విద్యార్ధులు మెయిన్స్‌కు హాజరవుతారు. అయితే అడ్మిట్ కార్డుల విషయంలో ఏటా పలువురు విద్యార్ధులు సర్వర్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక రెండు విడతల్లో మెయిన్స్‌లో మెరిట్ సాధించిన విద్యార్థుల్లో 2.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసి, పరీక్షకు అనుమతిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తెలంగాణలో 13 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఏపీలో కూడా పలు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఇక మే 18న అడ్వాన్స్‌డ్ పరీక్ష పూర్తయిన తర్వాత మే 22న అభ్యర్ధుల ఓఎంఆర్ పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. మే 26న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. 26 నుంచి 27 వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మే 25లోగా జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App