TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎప్పటికప్పుడు తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‎లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడంతో పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం వంటి వాటిని అరికట్టే విధంగా పోలీసులకు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహించారు

కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవాగాహన ఏర్పర్చుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావు వుండదని మీనా పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ, వ్యయపర్యవేక్షణ అనే అంశాలు ఎంతో కీలకమైనవని చెప్పారు. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, అయితే నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తదుపరి వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. ఎటు వంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించాలన్నా ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలను అయినా పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు మీనా. కుల, మత, భాష ప్రాతిపదిక ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్దమన్నారు

ఇంతకుమించి నగదు పట్టుకెళ్తే బుక్ అయినట్లే..

ఎన్నికల కోడ్ అమల్లోనున్న సమయంలో అభ్యర్థులు, ఏజంట్లు, కార్యకర్తలు 50 వేలకు మించి నగదు,10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషేధం. స్టార్ క్యాంపైనర్లు లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదని సీఈవో మీనా చెప్పారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేయడం జరుగుతుందని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. ఎన్నికల్లో పోటీచేసే లోక్ సభ అభ్యర్థులు 25 వేలు, శాసన సభ అభ్యర్థులు 10 వేలు నగదు రూపేణాగాని లేదా ఆర్.బి.ఐ, ట్రెజరీ ద్వారా సెక్యురిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుదన్నారు. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులను అనుమతించడం లేదన్నారు మీనా. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్.ఓ.లు, ఏఆర్ఓలు నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్థితో కలుపుకుని మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతించడం జరుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుదన్నారు. ప్రతి లోక్ సభ అభ్యర్థికి 95 లక్షలు, శాసన సభ అభ్యర్థికి 40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విధంగా అనుమతించిన వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, బహుమతులు, లిక్కరు ఇతర వస్తులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్దమైన వ్యయంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని, రోజువారి రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిష్టర్లను కూడా తప్పనికి సరిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. చాలా జిల్లాల్లోనూ ఇప్పటికే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారు వర్కుషాపులు నిర్వహించి ఈ అంశాలను అన్నింటినీ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించండం జరిగిందని, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో వర్కుషాపులు నిర్వహిస్తారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.