There should be a clear change in the municipal governance, State IT, Industries and Legislative Affairs Minister Duddilla Sridhar Babu
మంథని, జూన్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంథని మున్సిపాలిటీ పురపాలక పాలక వర్గం పాలనలో ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన పాలక వర్గం సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పి.రమా దేవిలతో కలిసి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
పాలక వర్గ సమావేశంలో మంథని పురపాలక సంఘం చార్జెడ్ ఖర్చు వివరాలు, మంథని పట్టణ అభివృద్ధి, టి.యూ.ఎఫ్.ఐ. డి.సి నిధుల వినియోగంపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలు ఆశించిన మార్పును మనం చేసి చూపించాలని, దీని కోసం మనం మూడు రెట్లు కష్టపడి పని చేయాలని మంత్రి సూచించారు. ఇక నుంచి మంథని మున్సిపాలిటీ అవినీతి రహితంగా, పారదర్శకంగా పనిచేయాలని పేర్కొన్నారు.
ప్రజలు హర్షించే విధంగా కౌన్సిలర్లు పనిచేయాలని, వీరికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. మున్సిపల్ పాలనలో దేశంలో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీస్ లను ఇక్కడ అమలు చేయాలని, దీని కోసం స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.
మున్సిపాలిటీలో అవసరం మేరకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే దిశగా వెంటనే మున్సిపల్ కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు, నీటి సరఫరా, మురికి కాలువ సమస్య, మొదలగు అంశాలపై ఫిర్యాదులు నమోదు చేసేందుకు దోహదపడేలా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు కావాలని మంత్రి ఆదేశించారు.
మంథని డంపింగ్ యార్డుకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి తరలించాలని మంత్రి ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఉండే స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వానాకాలం ప్రారంభమైన తరువాత కాలువలో నీటి ప్రవాహం ఆటంకం ఉండకుండా ముందస్తుగా చెత్త తొలగించి కాల్వలు శుభ్రం చేయాలని మంత్రి తెలిపారు.
ప్రస్తుత వానాకాలం సీజన్ లో ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, ప్రతి రోజూ ఉదయం పారిశుధ్య పనులు సకాలంలో ప్రారంభం కావాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, అపరిశుభ్రత కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు.
చెత్త తరలింపు రెగ్యులర్ గా జరగాలని , పారిశుధ్య ఇన్స్ పెక్టర్ రెగ్యులర్ గా వార్డులు తనిఖీ చేయాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని, భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు రావద్దని అన్నారు. మంథని పట్టణంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంథని పట్టణంలో పెండింగ్ లో ఉన్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం టి.యూ.ఎఫ్.ఐ. డి.సి నుంచి ప్రత్యేకంగా 38 కోట్లు కేటాయించిందని, దీనికి సంబంధించి పనుల ప్రతిపాదనలను వారం, 10 రోజుల లోపు రూపోందించాలని, 15 రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మంథని పట్టణం ఎంట్రెన్స్ ఆర్చ్, నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ నిర్మాణం, సమీకృత తహసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి కలెక్టర్ ను కోరారు. మంథని పట్టణంలో వేర్వేరుగా వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
మంథని పట్టణంలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంచేందుకు కార్యాచరణ అమలు చేయాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారికి అవసరమైన మొక్కలు అందించి పెంచాలని, గ్రీన్ మంథని, పరిశుభ్ర మంథని సాధన దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. మంథని పట్టణ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు.
అనంతరం మంత్రి మంథని మున్సిపల్ వార్డుల వారీగా ఉన్న సమస్యల గురించి కౌన్సిలర్లను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, మంథని మున్సిపల్ కమిషనర్ జి మల్లికార్జున స్వామి, సంబంధిత అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App