TRINETHRAM NEWS

There is no truth in the news that 12 lakh trees will be removed

వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేష్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు. రాడార్ ఏర్పాటు కోసం 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వ్యాపిస్తున్న వార్తలు నిరాధారమైనవనీ, అసంబద్ధమైవని ఆయన ఖండించారు.

“రాడార్ ప్రాజెక్టు నిర్మాణ కోసం కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48% విస్తీర్ణం మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఉపయోగించబడుతుంది. మిగిలిన 52% విస్తీర్ణంలోని అటవీ సంపదకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. 48 శాతం అటవీ భూమిలోనూ కేవలం రాడార్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన కొన్ని చెట్లను మాత్రమే తొలగించడం జరుగుతుంది. స్టేషన్ నిర్మాణానికి 12 లక్షల చెట్లను తొలగించనున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (భారత ప్రభుత్వం) కు అనుబంధంగా పనిచేసే ఫారెస్ట్ అడ్వైజరీ అథారిటి 1,93,562 చెట్లను మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం తొలిగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. రాడార్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత తొలిగించాలనుకున్న చెట్ల సంఖ్యను ఇంకా తగ్గించే దిశగా అటవీశాఖ ప్రణాళికలు రచిస్తున్నది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో కోల్పోనున్న 1,93,562 చెట్లకు బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అడవుల్లోని 2,348 హెక్టార్లలో విస్తరించి వున్న 17,55,070 చెట్లను అటవీశాఖ పునరుద్ధరించనున్నది” అని డోబ్రియాల్ తెలిపారు.

ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం రాడార్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సంబంధిత గ్రామాలతో పాటు, గ్రామ సభల ముందు పెట్టి ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్మానాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగటంలేదని జిల్లా కలెక్టర్ నుంచి ఆమోదం పొందిన తర్వాతనే పనులు చేపట్టడం జరుగుతుందని డోబ్రియాల్ వివరించారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ కోసం భారత ప్రభుత్వం 2010 నుండే చర్యలు చేపట్టడం జరిగిందనీ, అందులో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ భూ సేకరణ చేపట్టినట్లు డోబ్రియాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాటి నుండి కొనసాగిన రాష్ర్ర ప్రభుత్వాలతో పరస్పర సంప్రదింపులు జరిపి రాడార్ స్టేషన్ పనులను ముందుకు తీసుకువెళ్ళిందని అన్నారు. అందుచేత ప్రస్తుత రాష్ర్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నదనే విషయం అవాస్తవమైనదన్నారు.

ఈ ప్రాంతంలో 500 ఏళ్ళుగా కొలువైన వున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా తరలిస్తున్నారనే వాదనను డోబ్రియాల్ ఖండించారు. ఈ ప్రాంతంలో 32 ఎకరాల 10 గుంటల్లో విస్తరించిన ఈ దేవాలయంతో పాటు, దేవాలయానికి అనుబంధంగా ఉన్న కొలను అలాగే కొనసాగుతాయనీ, దేవాలయాన్ని సందర్శించే భక్తులకు నేవీ అధికారులు నుండి ఎలాంటి ఇబ్బందులు వుండవని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాధాన్యతను కలిగి వుండటంతో పాటు, స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందని పిసిసిఎఫ్ పేర్కొన్నారు. తమిళనాడులోని తిరునల్వేలి తర్వాత రాడార్ స్టేషన్ కలిగి వున్న ప్రాంతంగా, జాతీయ భద్రతను కల్పిస్తున్న కేంద్రంగా తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో ప్రత్యేకత చేకూర్చుతుందని డోబ్రియాల్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There is no truth in the news that 12 lakh trees will be removed