Trinethram News : న్యూఢిల్లీ
వయసు నిర్ధరణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవి ఇచ్చే జనన ధ్రువ పత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే పత్రాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. 1982లో జరిగిన హత్య కేసులోని ముద్దాయి పెట్టుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. పాఠశాలలు, మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీలు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ను ప్రామాణికమైనవిగా చూడాలని, అవి అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఇచ్చే ఆసిఫికేషన్ టెస్ట్ సర్టిఫికెట్ ను పరిశీలించాలని తెలిపింది.
1982 సెప్టెంబరు 10న జరిగిన హత్య సంఘనలో ప్రస్తుత కేసు పిటిషనర్ వినోద్ కటారాతో పాటు మరో మగ్గురికి ట్రయల్ కోర్టు 1986లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. ప్రస్తుతం వారు మథుర జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు శిక్షలు పడిన ముద్దాయిల్లో కొందరు నేరం జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్నారేమో పరిశీలించాలని అలహా బాద్ హైకోర్టులో పిల్’ దాఖలయింది. 2021లో దోషులను పరీక్షించిన మథుర జైలు మెడికల్ బోర్డు వినోద్ కటారా వయసు 2021 డిసెంబరు 10 నాటికి 56 ఏళ్లు ఉంటుందని నిర్ధరించింది. దీని ప్రకారం హత్య జరిగిన 1986 సెప్టెంబరు 10 నాటికి తన వయసు సుమారుగా 15 ఏళ్లు ఉంటుందని, అందువల్ల ఇంత శిక్ష విధించడం తగదని వినోద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వినోద్ వయసుపై నివేదిక ఇవ్వాలని ఆగ్రా అదనపు జిల్లా కోర్టు జడ్జిని 2022 సెప్టెంబరు 12న ఆదేశించింది. స్కూల్ సర్టిఫికెట్లతో పాటు పలు పత్రాలను పరిశీలించిన ఆ జడ్జి.. నేరం జరిగినప్పుడు వినోద్ మేజరేనని తేల్చారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది.