ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం)
2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.
హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణ ఉత్కంఠ భరితంగా మారింది. తెలంగాణ ఏర్పాటు అంశం క్షణ క్షణానికి టెన్షన్ పెంచుతోంది. నిముష నిమిషానికీ ఆందోళన అధికం అవుతోంది. ఊహించని ఒక మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆ రోజు తాడో పేడో తేల్చుకోవాలని, ఎలాగైనా తెలంగాణను సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఎలాగైనా అడ్డుకుంటామని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీలంతా అప్పటికే పలు వేదికల ద్వారా ప్రకటించు కున్నారు. ఉత్కంఠ వాతావరణంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. కేంద్ర మంత్రులుగా ఉన్న చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలతో పాటు ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ తదితరులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి తమ నిరసన తెలిపారు. తప్పని స్థితిలో స్పీకర్ మీరాకుమార్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఈలోగా ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు చర్చలు జరిపారు.
అప్పటికే తెలంగాణ బిల్లుకు బీజేపీ పలు సవరణలను ప్రతిపాదించింది. అయితే, అవి రాజకీయ లబ్ధి కోసం చేసిన సవరణలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీ సింగ్ విలేకరులతో అన్నారు. తెలంగాణ బిల్లు నిలిచి పోతుందనే భావన అప్పటికి ప్రబలమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ 2 ప్రభుత్వానికి అవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు. ఆ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగిసి పోనున్నాయి. లోక్‌సభ లోను, ఆ తర్వాత రాజ్యసభ లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలంటే.. నిబంధనల ప్రకారం దాని కంటే ముందు ఆంధ్రా ఎంపీలు ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పరిష్కరించాల్సి ఉంటుంది. తెలంగాణ విషయంలో అప్పటి వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఆ రోజు సభలో జరుగుతున్న పరిణామాలను గమనించిన లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం లోనే ఉండి పోయారు.
ఆరోజు సభ వాతావరణాన్ని బట్టి తెలంగాణ బిల్లు ఆమోదం పొందదని అద్వానీ భావించారని అందరూ అనుకున్నారు. 15వ లోక్‌సభకు అవే చివరి సమావేశాలు, అవీ మూడు రోజుల్లో ముగిసి పోనున్న సమయంలో రాష్ట్ర విభజన వంటి బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించదని అద్వానీ అభిప్రాయ పడడం అత్యంత సహజం. అయితే తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సుష్మా స్వరాజ్ ‘ఎవరేమనుకున్నా సరే.. నేను తెలంగాణకు మద్దతు ఇస్తాను’ అని ఆమె హామీ ఇచ్చారు.
అయితే, ‘మీ కమల్‌నాథ్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి) అటూ.. ఇటూగా ఉన్నారు. చూసుకోండి’ అని ఆమె ఎంపీ లకు తెలిపిన సందర్భంలో.. . జైపాల్ రెడ్డిని వెంటబెట్టుకుని వారు స్పీకర్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడికి సుష్మా స్వరాజ్‌ను కూడా పిలిపించారు.
తెలంగాణ ఏర్పాటుపై మీకు చిత్తశుద్ధి లేదంటే మీకు చిత్తశుద్ధి లేదంటూ ఇరువర్గాలు పరస్పరం ఆరోపించు కున్నాయి. సుష్మా స్వరాజ్ మాత్రం . ‘మీరు బిల్లు పెట్టండి. మేం సహకరిస్తాం’ అని స్పష్టంగా చెప్పారు. దీంతో జైపాల్ రెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ స్థానానికి ముందు భాగంలో ఎంపీలు నిలబడి ఆందోళనలు చేస్తుంటే తెలంగాణ బిల్లును ఎలా ఆమోదిస్తారు? (నిబంధనలు అంగీకరిస్తాయా?) అని అడిగారు. ఎందుకంటే.. తెలంగాణ బిల్లు ఆమోదానికి సభలో మూడిరట రెండు వంతుల మెజార్టీ అవసరం. దీనికి ఓటింగ్ కూడా జరపాల్సి ఉంటుంది. సెక్రటరీ జనరల్ నిబంధనలు వివరిస్తూ..367.. నిబంధన ప్రకారం డివిజన్ లేకుండా ”హెడ్ కౌంట్”తో బిల్లును ఆమోదించ వచ్చని చెప్పగా స్పీకర్ పాత రికార్డులను పరిశీలించారు. సభకు నిరాటంకంగా అంతరాయాలు కలుగుతున్నప్పుడు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తే హెడ్ కౌంట్ (ఎంపీలను నిలబెట్టి, లెక్కించడం) సరిపోతుందని తేల్చి చెప్పారు.
దీంతో సుష్మా స్వరాజ్ నిర్ణయం కీలకమైంది. ఆమె అంగీకరిస్తేనే స్పీకర్ మీరాకుమార్ హెడ్ కౌంట్ పద్ధతికి ఒప్పుకునే అవకాశం ఉంది. సుష్మా స్వరాజ్ దానికి అంగీకరించారు. ‘మీరు బిల్లు పెట్టండి. నేను లేచి నిలబడి మాట్లాడతాను. తర్వాత హోం మంత్రిని ఒక్కొక్క క్లాజు చదువుకుంటూ వెళ్లమనండి. అలాగే ఓటింగ్ కూడా పెట్టండి’ అని సూచించారు. దీనికి అంతా అంగీకరించారు”.
నిజానికి అప్పటికి బీజేపీలో తెలంగాణ ఏర్పాటును అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఉంది. అయితే, నిజానికి బిల్లును పెట్టడానికంటే ముందే సోనియాగాంధీ… ప్రధాని మన్మోహన్ నివాసంలో అద్వానీ, సుష్మా స్వరాజ్‌లను లంచ్‌కు పిలిచి, తెలంగాణకు సహకరించాలని కోరారు. సుష్మా స్వరాజ్ పలుమార్లు పార్లమెంటు లోపల, బయట తెలంగాణకు మద్దతు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలకు కట్టుబడి ఉండాలని, మాట తప్పకూడదన్న ఒకే ఒక విచక్షణతో తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.
లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలి హోదాలో సుష్మా స్వరాజ్ ప్రసంగించగా, కాంగ్రెస్ పార్టీ తరపున జైపాల్ రెడ్డి ప్రసంగించారు. బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిపి చర్చలో ప్రసంగించింది మొత్తం ముగ్గురు మాత్రమే కావడం గమనార్హం. బిల్లుపై ఓటింగ్ జరిగేప్పుడు హెడ్ కౌంట్ పద్ధతిని పాటించాలని స్పీకరే నిర్ణయం తీసుకున్నారని, దాన్ని తాము అంగీకరించామని బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ వివరించారు. అలా ఈ క్రమంలో 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సంపూర్ణ మద్దతును ఇస్తామని హామీ ఇచ్చి, ఆచరించి ఆమోదం పొందింప చేసినందుకే సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారు.