అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్
Trinethram News : పశ్చిమ గోదావరి జిల్లా : కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వ్యాధి కారణంగా జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి, దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో కోళ్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో మార్కెట్లో అమ్మకాలు పూర్తిగా పతనమయ్యాయి. వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి ఇదే వైరస్ తిరిగి ప్రబలుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ వైరస్ సోకిన కోడికి ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు. ఉదయం ఆరోగ్యంగా ఉన్న కోడి, మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి చనిపోతుంది. వైద్యుల ప్రకారం.. ఈ వైరస్ కోడి గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.గుండె చుట్టూ నీరు చేరి గుండెపోటుతో కోడి మరణిస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, వైరస్ సోకిన కోళ్లకు అది పని చేయడం లేదు.వైరస్ సోకిన కోడి వల్ల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కోళ్లకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోళ్ల మధ్య వేగంగా వ్యాపించే ఈ వైరస్ కారణంగా కొన్ని గంటల్లోనే పెంపక కేంద్రాల్లోని అన్ని కోళ్లు చనిపోతున్నాయి.
మృత్యువాత చెందిన కోళ్లను రహదారుల పక్కన సంచుల్లో వేయడం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కోళ్ల కళేబరాలను 3 అడుగుల లోతైన గోతిలో పూడ్చి, సున్నం వేసి నశింపజేయాలని, లేదా కాల్చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే వైరస్ వ్యాప్తి నుంచి మిగిలిన కోళ్లను రక్షించవచ్చు.వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల మాంసం తినడం ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు మాస్కులు, గ్లవ్స్ వంటివి ఉపయోగించి జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ వైరస్ కారణంగా మార్కెట్లో కోళ్ల ధరలు పడిపోవడం, అమ్మకాలు తగ్గడం వంటి పరిణామాలు ఏర్పడే అవకాశముందని పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు కోళ్లను గుంపులుగా ఉంచకుండా, శుభ్రత పాటిస్తూ, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని వ్యాపారులు, పెంపకందారులకు వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App