TRINETHRAM NEWS

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70 % 80% ఖర్చుపెట్టడం, కొంతమంది అదనంగా అప్పులు కూడా చేసి ఆర్థికంగా కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ దురాచారానికి కారణాలు ఏమిటి?
ఏదైనా ఒక వేడుక జరుపుకునే విధానం వ్యక్తిగతం. అయితే మన భారతీయ సమాజంలో పెళ్ళికి కొంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎవరైనా పెళ్లి వేడుక జరిపినప్పుడు, సహజంగా బాగా చర్చకు వచ్చే అంశాలు ఎంత ఖర్చుపెట్టి చేసారు? ఎంత కట్నం ఇచ్చారు? ఎంత బంగారం పెట్టారు? ఈ తరహా సంభాషణలు, చర్చలు……..ఆడపిల్లల తల్లితండ్రుల మీద ఒకరకమైన ఒత్తిడి పెంచుతుంది. భవిషత్తులో తమ పిల్లలకు తాముకూడా అదేవిధంగా పెళ్లి చెయ్యకపోతే సమాజంలో తమ “పరువు” “గౌరవం” పోతుందేమో అన్న భయం పట్టుకుంటుంది. దీని పర్యవసానం ఎన్నో ఏళ్లుగా కష్టం చేసి సంపాదించిన డబ్బును, ఆస్తులను ఒక్కరోజులో “పెళ్లి” “కట్నకానుకలు” పేరుతో ఇతరులకు ధారపోయడం. మరికొందరు అప్పులు చేసి ఆర్థిక కష్టాల్లో పడిపోవడం. అదే డబ్బును తమ కూతురు చదువు కోసమో, జీవనాధారం కోసమో పెడితే వారు భవిషత్తులో ఆర్థిక స్వాతంత్య్రంతో చాలా బాగా జీవిస్తారు అన్న ఆలోచన చాలా చాలా తక్కువమంది తల్లితండ్రులతో కనిపిస్తుంది. అయితే ఎక్కువశాతం తల్లితండ్రులు ఇలా ఆలోచించేలా చేసింది ఎవరు? మనకున్న చట్టాల ప్రకారం కట్నం ఇవ్వడం , తీసుకోవడం రెండూ నేరమే. కానీ ఇది పేరుకే పరిమితం. దాదాపు 90 % పెళ్లిళ్లలో ఇంకా కట్నం ఆచారం నడుస్తూనే ఉంది. దీనికి చదువులేకపోవడం అనేది ఒకప్పుడు బాగావినిపించిన వాదన. అయితే బాగా చదువుకొని పట్టణాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు చేసే పెళ్లికొడుకులు మరింత కట్నం పొందడం మనందరికీ తెలిసినదే. కాబట్టి చదువుతో ఈ దురాచారానికి సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయపార్టీలు కూడా పేదవారికి సహాయం పేరుతో “పెళ్లి కనుక”, “షాదీ ముబారక్” పేరుతో పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తూ పరోక్షంగా ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించడం దురదృష్టకరం.
అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది. ఆడపిల్లల తల్లితండ్రులు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయా ? విదేశాల్లో ఉద్యోగం ఉందా?…..ఇలా అన్నీ బాగా విచారించి, అటువంటి వారితో మాత్రమే పెళ్లి సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారినుంచి కట్నకానుకలు తీసుకోవడంలో తప్పేమి లేదు అని. ఇది వినడానికి కొంత లాజికల్ గా అనిపించినా వాస్తవంలో సరైన పద్ధతిలా అనిపించదు. ఉదాహరణకి ఎన్నో లక్షలు, కోట్లు కట్నంగా ఇచ్చిన వారుకూడా పెళ్లి అనంతరం ఉద్యోగాలు చేస్తూ, ఇంటిపనులన్నీ చేస్తూ జీవితాంతం చాకిరి చెయ్యడమే తప్ప తమ తల్లితండ్రులు తమకు కట్నకానుకలుగా ఇచ్చిన వాటిని అనుభవించడం అనేది చాలా చాలా అరుదు. ఇది వినడానికి కఠినంగా అనిపించినా ఇదే చాలామంది జీవితాలలో ప్రస్తుతం ఉన్న పరిణామం. ఇంట్లో చేసే వంటపని, ఇంటిపని, పిల్లలకి సంబందించిన పనులు……ఇవేవి పెద్దగా లెక్కలోకి రావు. వాటివల్ల ఆదాయం రావటం లేదు కదా అన్న ఆలోచన తప్ప , ఆ పనులలో ఎంత కష్టం ఉంది ? ఆ పనులకోసం ఇంకెవరినైనా పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ? అన్న ఆలోచన చాలా తక్కువమందిలో ఉంటుంది.
మరి పుట్టినప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ పిల్లలను ఇలా పెళ్లిపేరుతో అంతంత ఖర్చుచేసి, కట్నకానుకలు ఇచ్చి చివరికి వారిని మరో ఇంట్లో పనివారిగా , ఆర్థిక స్వాతంత్య్రం లేని వారిగా మార్చడం ఎందుకు ? ఎందుకంటే సమాజం అలానే ముందుకుపోతుంది, కాబట్టి సమాజంతో మనం కూడా ఆలా వెళ్లిపోదాము అన్న ఆలోచన.
**ఎప్పటిలాగే ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి రాసినది కాదు, ఈ అంశంలో ఎక్కువమంది చేస్తున్న ఆలోచనా విధానాన్ని గమనించి రాసినదే.