వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెన్షన్లపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు రాక్షసమనస్తత్వానికి నిదర్శనం అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండి కూడా వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అదే అహంకారం, అదే లెక్కలేని తనం అని ఘాటుగా స్పందించారు. కూటమిలో ఉన్నా.. జనసేన, బీజేపీ సీట్లను చంద్రబాబు శాసించారన్నారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థను ఆపేసి.. సంక్షేమం, పెన్షన్లు ఆపించే యత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఏజెంట్గా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మేలు చేయడమే పురంధేశ్వరి ఎజెండాగా ఉందని విమర్శించారు. అందరి ప్రయత్నమంతా చంద్రబాబు అధికారం కోసమే అని ధ్వజమెత్తారు. 2024లో టీడీపీ 2019 కంటే ఘోరంగా ఓడిపోబోతోందని జోస్యం చెప్పారు. గతంలో వాలంటీర్ వ్యవస్థను ఘోరంగా అవమానించి ఎన్నికలు రాగానే వాళ్లను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రావణుడిలా చంద్రబాబు మారువేషంలో ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి చంద్రబాబు పాలన ఎక్కడ వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారన్నారు.
అధికారులపై బాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని తెలిపారు. అలాగే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురించి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు తెలంగాణ వదిలి ఉన్నపళంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. ఆమె ఒక షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మేమంతా సిద్దం సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు.