Sunita Williams is at risk of ‘space anemia’.. What is the problem?
Trinethram News : వాషింగ్టన్: అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగివచ్చేందుకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది. జూన్ 5న వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె స్పేస్ ఎనీమియా బారిన పడే ముప్పు ఉంది. అసలు ఏంటా సమస్య..
అంతరిక్షంలో ఉన్న సమయంలో వ్యోమగాముల్లో ఎర్రరక్తకణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు. ‘మైక్రో-గ్రావిటీ’కి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనుకు రెండు మిలియన్ల రక్తకణాల ఉత్పత్తి, క్షీణత జరుగుతుంది. ఆరు నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా.. ఆ క్షీణత సంఖ్య సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఆ అధ్యయనం వివరాలు నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.
ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే ఈ స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది.
మిషన్‌లో భాగంగా స్పేస్‌లో ఉన్నంతకాలం ఎర్రరక్తకణాలు తగ్గుతూనే ఉంటాయని, ఈ పరిస్థితి హిమోలిసిస్ అంటారని అధ్యయనకర్తలు తెలిపారు. వ్యోమగాములు భూమిపైకి తిరిగివచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఈ క్షీణతను ఎదుర్కొనేందుకు అధికంగా పోషకాహారం తీసుకోవాల్సి రావొచ్చని, ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా గత జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. అయితే వారంలోగా వ్యోమగాములు భూమిపైకి తిరిగిరావాల్సి ఉంది. కానీ, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది.
అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అవి విఫలం కావడంతో ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండనున్నారు. సునీతా, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారు. దాంతో నెలలపాటు అక్కడే ఉండనున్న సునీత(Sunita williams) స్పేస్ ఎనీమియాతో పాటు ఎముకలు సాంద్రతను కోల్పోయే ప్రమాదం, దృష్టిలో మార్పులు ఎదుర్కొనే ముప్పు ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App