Trinethram News : బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం
జూదం అనే వ్యసనం జీవితాలను నాశనం చేస్తుంది.
సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించం
-జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు
కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందాలు, జూదం, మట్కా వంటి వాటి వలన అనేక మంది సులభంగా వచ్చే అధిక డబ్బులకు ఆశపడి పందాలు కాసి వారి ధనాన్ని నష్టపోతున్నారన్నారు. దీనివలన వారి కుటుంబాల జీవనవిధానం అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందన్నారు. కనుక జిల్లాలో ఎక్కడ కోడిపందాలు, జూదం నిర్వహించకుండా వుండేందుకు గతంలో వీటిని నిర్వహిస్తూ, ఆడుతూ పట్టుబడిన వారు మరల వాటి జోలికి వెళ్లకుండా బైండవర్ చెయ్యడం జరుగుతుందన్నారు. గతంలో కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలపై, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జిల్లాలో కోడిపందాలు నిర్వహించినా, పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొందరు యువకులు జూదం అనే వ్యసనానికి బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జూదంలో కోల్పోయిన డబ్బులను సంపాదించడానికి చిన్నచిన్న దొంగతనాలు చేయటానికి సైతం వెనుకాడట్లేదన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచుట కొరకు అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమన్నారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ గారికి లేదా డయల్ 100, 112 నంబర్ లకి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, దీని వలన ప్రజలకు మెరుగైన సేవలను అందించగలుగుతామని ఎస్పీ గారు తెలిపారు.