తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
Trinethram News : జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
జనవరి 18,26 తేదీల్లో ఫిబ్రవరి 3 ,12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ ప్రపంచం లోనే అతి పెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడ కు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ లు శ్రీ రామకృష్ణ, శ్రీ మునిరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App