TRINETHRAM NEWS

హైదరాబాద్‌: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, సికింద్రాబాద్‌ స్టేషన్‌ను బైపాస్‌ చేస్తూ ఈ మార్గంలో కొన్ని రైళ్లు నడపడానికి వీలు కలుగుతుందని తెలిపారు. రైల్వే బడ్జెట్‌ కేటాయింపులపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచే కొన్ని రైళ్లు నడుపుతామని.. లింగంపల్లి – సనత్‌నగర్‌ – మౌలాలి – చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండా కొన్నిటిని నడపడం ద్వారా రైళ్ల ఆలస్యానికి చెక్‌ పెడతామన్నారు. చర్లపల్లి స్టేషన్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్‌లో రూ. 46 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. రూ. 817 కోట్ల అంచనాలతో 2012 -13లో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండోదశకు రూ. 50 కోటు, ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు కొనసాగించడానికి మరో రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.381 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. సఫిల్‌గూడ ఆర్‌యూబీకి రూ.2 కోట్లు, ఫలక్‌నుమా – బుద్వేల్‌ మధ్య నాలుగో లైనుకు రూ.5 కోట్లు కేటాయించారు.మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య 21 కి.మీ.ల మేర రెండో లైను, విద్యుదీకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నారు. సీతాఫల్‌మండి- మౌలాలి-మల్కాజిగిరి మధ్య 10 కి.మీ.ల మేర నాలుగో లైను నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మౌలాలి – సనత్‌నగర్‌ మధ్య రెండో లైను సిద్ధమవ్వడంతో లింగంపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో కొన్నిటిని సనత్‌నగర్‌ – మౌలాలి మీదుగా నడుపుతామని.. ఎంఎంటీఎస్‌లు కూడా కొంత మేర అందుబాటులోకి తెస్తామని జీఎం చెప్పారు.