TRINETHRAM NEWS

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది ..తన అకౌంట్‌లో కేవలం రూ.41..మాత్రమే ఫేక్ ట్రాన్సఫామ్ తో బురిడీ కొట్టించ బోయి అడ్డం గా దొరికిపోయింది .. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్

డూప్లికేట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నట్టుగా బురిడీ కొట్టించిన మహిళ

ఎలాంటి లావాదేవీలు జరగడంలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన హోటల్ సిబ్బంది

నిందితురాలిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని ఏరోసిటీలో ఓ విలాసవంతమైన హోటల్‌లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు రూ.6 లక్షలు బిల్లు పడింది. కానీ ఆమె అకౌంట్‌లో కేవలం రూ.41 ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని ‘పుల్‌మన్ హోటల్‌’లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితురాలు హోటల్‌ను మోసం చేసిందని, ఆమె ఖాతాలో కేవలం రూ.41 మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే నిందిత మహిళ హోటల్‌లో బస చేయడానికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదన్నారు. నిందిత మహిళకు సంబంధించిన అడ్రస్, వివరాలు తెలియజేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని, ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నిందిత మహిళ విచారణకు సహకరించడం లేదని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని, ఆమె అకౌంట్‌ను చెక్ చేయగా కేవలం రూ.41 ఉన్నాయని గర్తించామని తెలిపారు. నిందిత మహిళ పేరు ఝాన్సీ రాణి శామ్యూల్ అని, 15 రోజుల పాటు ‘పుల్‌మన్ హోటల్‌’లో ఆమె బస చేసిందని తెలిపారు. దాదాపు రూ.5,88,176 విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని చెప్పారు. హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేసిందని పోలీసులు వివరించారు.

నిందిత మహిళ హోటల్‌లో రూ. 2,11,708 విలువైన సర్వీసులు పొందిందని హోటల్ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ యాప్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు ఝాన్సీ వివరాలను చూపించిందని, అయితే అవి హోటల్‌ అకౌంట్‌లోకి రాలేదని చెప్పారు. ఎలాంటి చెల్లింపులు జరగలేదని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఝాన్సీ డూప్లికేట్‌‌ యాప్ ఉపయోగించిందని తెలిపారు. ఇక తాను ఒక డాక్టర్‌ అని, తన భర్త కూడా వైద్యుడే అని చెబుతోందని పోలీసులు చెప్పారు. తన భర్త న్యూయార్క్‌లో ఉంటున్నారని చెప్పిందని, అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఝాన్సీని జనవరి 13న అరెస్టు చేశామని చెప్పారు. ఐపీపీ సెక్షన్లు 419 (మోసం), 468 (ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాల్ని ఉపయోగించడం) కింద కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.