రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం హరీశ్‌రావు
గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక తప్పుడు లెక్కలు చెప్పి, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రూ. 5 లక్షల కోట్ల అప్పును రూ. 7 లక్షల కోట్లుగా చూపారని మాజీ మంత్రి పేర్కొన్నారు. దేశంలో 22 రాష్ట్రాలు అప్పుల్లో తెలంగాణ కంటే ముందున్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి ఈ ప్రభుత్వం వెల్లడించలేదు. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందుంది అని హరీశ్‌రావు తెలిపారు.
పర్ క్యాపిటలో తెలంగాణ నంబర్ వన్‌లో ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. శ్వేతపత్రంలో పెరిగిన జీఎస్డీపీని చూపించే ప్రయత్నం చేయలేదు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజలకు కలిగిన వసతుల గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు. 47 లక్షల మంది వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ. 2 వేల ఆసరా పెన్షన్ ఇచ్చి కాపాడే ప్రయత్నం చేశాం. 69 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లు రైతుబంధు ఇచ్చాం. 13 లక్షల 50 వేల మంది పేదింటి ఆపడపిల్లలకు కల్యాణలక్ష్మి ఇచ్చాం. రాష్ట్రంలో ఆస్పత్రులు బాగు చేసుకున్నాం. 50 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. పెరిగిన పంటల ఉత్పత్తి చెప్పలేదు అని హరీశ్‌రావు తెలిపారు.
సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేరు, ఎల్లపంల్లి, దేవాదుల, నెట్టెంపాడు కల్వకుర్తి, తుమ్మిళ్ల వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చాం. దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) ఏమైనా నేరమా..? రాష్ట్రాలకు తమ తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాం. భవిష్యత్‌లో ఓడీ వాడమని మీరు ఈ సభకు హామీ ఇస్తారా..? ఈ రాష్ట్రం ఓడీలోకి వెళ్లదని ఏమైనా హామీ ఇస్తారా..? అని భట్టి విక్రమార్కను హరీశ్‌రావు అడిగారు.