ఇష్టంతో చదవండి… సంతోషంగా పనులు చేయండి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
హైదరాబాద్- న్యూస్‌టుడే, అమీర్‌పేట్: ‘తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ ఇష్టంతో చదవండి…
సంతోషంగా పనులు చేయండి’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విద్యార్థులకు సూచించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం జరిగిన శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రపతి మాట్లాడుతూ..
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల సమర్థులైన నాయకులను తయారుచేయడంలో ఎంతో ఘనత సాధించిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతనునారాయణ్ ఇందుకు నిదర్శనమన్నారు.
వీరితోపాటు దేశ విదేశాల్లోని సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న ఇక్కడి పూర్వ విద్యార్థులను ప్రస్తుత విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చదువుతో విజ్ఞానాన్ని, క్రీడలతో మానసికోల్లాసాన్ని పొంది వ్యక్తిగతంగా సమగ్ర అభివృద్ధి సాధించాలని అభిలషించారు. నూతన జాతీయ విద్యావిధానంతో విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. విద్యార్థులు తమతో పాటు సహచరులనూ పైకి తీసుకురావాలని, దేశం కోసం కృషి చేయాలని తెలిపారు.
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..
విద్యార్థులు ఉదయం చదువు, సాయంత్రం ఆటలతో గడపాలని, ఆటలంటే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్‌లో ఆడేవి కావని హితవుపలికారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక శక్తి ఉంటుందని దాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి సీతక్క, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు గుస్తి జె.నోరియా తదితరులు పాల్గొన్నారు