రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల షెడ్యూల్.. 17న అయోధ్య వీధుల్లో విహరించనున్న బాల రామయ్య
రామ జన్మ భూమి అయోధ్య (అయోధ్య) స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమవుతోంది. జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలోని గర్భాలయంలో రామ్‌లల్లాను ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను ప్రత్యేకంగా, చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు అయోధ్యలో సన్నాహాలు మొదలయ్యాయి.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు నుంచే ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. మహా మస్తకా అభిషేక కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై జనవరి 22 వరకు ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ ట్రస్టు విడుదల చేసింది.
అయోధ్య రామాలయ ప్రారంభమహోత్సవ కార్యక్రమాల వివరాలు
1.జనవరి 16న ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం జరుగుతుంది. విష్ణుపూజ , గోదానాన్ని చేస్తారు.
2.జనవరి 17న బలరాముడి రూపంలో ఉన్న రాముడి విగ్రహాన్ని నగరంలో ఊరేగిస్తారు. భక్తులు మంగళ కలశంలో నీరు నింపి ఊరేగిస్తారు
3.జనవరి 18న గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరణం, వాస్తు పూజ వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
4.జనవరి 19న అగ్ని పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ యాగాలను నిర్వహిస్తారు.
5.జనవరి 20న, రామమందిరంలోని గర్భగుడిని సరయు పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం వాస్తు శాంతి, అన్నదానంతో పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
6.జనవరి 21న బాల రాముని విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు.
7.జనవరి 22న విగ్రహానికి పూజలు నిర్వహించి మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో అభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామ్ లల్లా మూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠించనున్నారు.
శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. దాదాపు 4,000 మంది సాధువులతో పాటు 2,200 మంది ఇతర అతిథులకు ఆహ్వానాలు అందుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో అయోధ్యలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ బృందాలు మకాం వేశాయి. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ.. భారీ బందోబస్తుకు సన్నాహాలను చేస్తున్నారు.
శంకుస్థాపన సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెన్స్ నిఘాను నిర్వహించేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి గడపపైనా నిఘాను ఏర్పాటు చేశారు. శ్రీరామ మందిరంలో వేడుకల నిర్వహణ సమయంలో మాత్రేమే కాదు భవిష్యత్తులో అయోధ్య ఆలయంలో ఏర్పాటు చేయాల్సిన భద్రత కోసం పోలీసు డేటాబేస్‌లో నేరస్తులను ట్రాక్ చేసేందుకు బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భద్రత నడుమ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.