Trinethram News : సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్ పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్థాన్ వల్ల కాకపోతే ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తుచేసుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో మా తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు నాకు పెరోల్ కూడా ఇవ్వలేదు. అలాంటిది కాంగ్రెస్… మమ్మల్ని నియంతలుగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది’’ అని రాజ్‌నాథ్ దుయ్యబట్టారు.
ఉగ్రదాడులను ఉద్దేశిస్తూ రక్షణమంత్రి ఇటీవల పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ‘‘దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే… తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్ కు పారిపోయినా వదలం. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతాం’’ అని హెచ్చరించారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక న్యూఢిల్లీ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై స్పందిస్తూ గతంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదని… వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదని ఆయన స్పష్టం చేసారు.