TRINETHRAM NEWS

హరిత నగరంగా రాజమండ్రి శోభిల్లాలి

– పేపర్ మిల్లు వద్ద ‘హరిత-యువత’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ భరత్, సినీ నటి రతిక రోజ్, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ

రాజమండ్రి, డిసెంబరు 21: ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్ది హరిత నగరంగా మార్చడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని పేపర్ మిల్లు వద్ద డివైడర్ లో ‘యువత హరిత’ (గో గ్రీన్ ఛాలెంజ్) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, యువత, నగర వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్, సినీ నటి రతిక రోజ్, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు పాల్గొన్నారు. తొలుత సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా భారీ కేక్ ను ఎంపీ భరత్ కట్ చేశారు. గాలిలోకి బెలూన్లు వదిలారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నారు. గ్లోబల్ వార్మింగ్ ని పూర్తిగా నివారించవచ్చునని, హరిత నగరంగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు. ఒక మొక్కను కంటికి రెప్పలా చంటి బిడ్డలా మనం కాపాడగలిగితే..రేపు మన ప్రాణాల్ని కాపాడేందుకు స్వచ్చమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు. దేశంలో 149 కోట్లకు పైగా జనాభా ఉన్నారని, ప్రతీ ఒక్కరూ ఒక మొక్క నాటితే యావత్ భారత దేశంలో హరిత విప్లవం సాధ్యమేనన్నారు. తద్వారా వాతావరణంలో కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చునని చెప్పారు. యువత తలచుకుంటే సాధ్యం కానిదేదీ లేదని అన్నారు. రాష్ట్రంలో తొలి హరిత నగరం రాజమండ్రి కావాలనేదే లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ‌ప్రతీ విద్యార్థి, యువతీ యువకులు ఒక మొక్కను పెంచి రేపటి తరానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, పరిశుభ్రమైన గాలిని కానుకగా అందించవచ్చునని అన్నారు. యువత హరిత కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతోనే సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నటి రతిక రోజ్, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఎంపీ భరత్ ను అభినందించారు. ఇటువంటి చక్కని, ఎంతో విలువైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఎన్వీ శ్రీనివాస్, గుర్రం గౌతమ్, టీకే విశ్వేశ్వర రెడ్డి, నక్కా శ్రీ నగేష్, పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, కొత్తా విజయ రాజ్యలక్ష్మి, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.