TRINETHRAM NEWS

China Covid-19: చైనాలో మరోసారి కలవరం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. దహన సంస్కారాల కోసం క్యూ లైన్లు!

కరోనా ప్రభావం చైనాలో మరోసారి కనిపిస్తోంది. ఇక్కడ, సంక్రమణ వేగం వేగంగా పెరుగుతోంది. కరోనా మరణాల కారణంగా చైనాలోని శ్మశానవాటికలు 24 గంటలు పని చేసే పరిస్థితి నెలకొంది. కోవిడ్ కొత్త సబ్-వేరియంట్ JN.1 వ్యాప్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో పెరుగుతున్న JN.1 కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

స్థానిక మీడియా కథనం ప్రకారం, కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి కారణంగా, చైనాలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. శ్మశాన వాటికల వద్ద జనం మరోసారి కనిపించారు. కొత్త సబ్-వేరియంట్ JN.1ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ కేటగిరీలో చేర్చింది. ఇటీవలి రోజుల్లో చాలా దేశాల్లో JN.1 కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శ్మశానవాటికల దగ్గర క్యూ లైన్..
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతోందని డైలీ స్టార్ తన నివేదికలో నివేదించింది. ప్రభుత్వ శ్మశానవాటికలకు చాలా మృతదేహాలను తీసుకురావడం వల్ల రద్దీ పెరిగింది. 24 గంటలూ శ్మశానవాటికలలో మృతదేహాలను కాల్చి వేస్తున్నారు. ఇదొక్కటే కాదు, దహనం చేయడానికి వేచి ఉన్న మృతదేహాలను ఫ్రీజర్‌లో ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దహన సంస్కారాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

భారతదేశంలో కరోనా పరిస్థితి
ఇక భారత దేశంలో ప్రస్తుతం 1,18,977 పాజిటివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 7,557 మంది పరిస్థితి విషమంగా తీవ్రమైన స్థితిలో ఉన్నారు. అయితే, దేశంలో మరణాలకు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు వెల్లడికాలేదు. భారతదేశంలోని కరోనా పరిస్థితిపై నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కో-ఛైర్మన్ రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని, అయితే చాలా కేసులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదన్నారు. అలాగే దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.