TRINETHRAM NEWS

డిజిటల్‌ యుగంలో సవాళ్లూ ఉన్నాయి: రాష్ట్రపతి

Trinethram News : దిల్లీ : ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తంచేశారు..

సైబర్‌ నేరాలు, డీప్‌ ఫేక్‌, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మానవులకు కొత్త ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్‌ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని ‘మానవ హక్కుల దినోత్సవం’ (Human Rights Day) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పేర్కొన్నారు.

భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో సైబర్‌ నేరాలతో పాటు వాతావరణంలో వచ్చే వివిధ రకాల మార్పులను ఎదుర్కొంటోందని ముర్ము అన్నారు. ప్రస్తుత ప్రజల జీవితాల్లో ఏఐ ప్రభావం గురించి ఆమె మాట్లాడుతూ ”కృత్రిమ మేధ ఇప్పుడు మన రోజూవారీ జీవితంలోకి ప్రవేశించింది. మన సమస్యలను పరిష్కరిస్తోంది. కానీ మనకు తెలియకుండానే పలు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. దీనికి ప్రాణం లేకపోయినా సృష్టించింది మానవులే కాబట్టి.. ఈ సవాళ్లకు మనమే తగిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.

సార్వత్రిక మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948లో ఆమోదించింది. ఆ తీర్మానంలో రూపొందించిన హక్కులు, స్వేచ్ఛపై అందరిలోను అవగాహన పెంచి, వాటి అమలుకు రాజకీయ దృఢ సంకల్పాన్ని పెంపొందించడానికి ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన పెంచడానికి, ప్రభుత్వాలు మరింత బలంగా వాటి పరిరక్షణకు పూనుకోవడానికి ఈ కార్యక్రమాలు ప్రేరణగా నిలిచే అవకాశం ఉందని ఐరాస పేర్కొంది. ఇందులోభాగంగా రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని పిలుపునిచ్చింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App