ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగినట్లు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్-జూన్ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉండే అవకాశం ఉందని ఆయనకు అధికారులు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నిత్యావసర మందులు, ఐస్ ప్యాక్, ఓఆర్‌ఎస్, తాగునీటి లభ్యత ఏర్పాట్లపై సమీక్షించారు.
‘‘2024లో ఊహించినదాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే మార్గదర్శకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి. దీనివల్ల విస్తృత స్థాయిలో ప్రజలకు మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.