జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?
గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి షర్మిల ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపక తప్పలేదు. అయితే ఆమె తెలంగాణ రాజకీయాల కోసమే కాంగ్రెస్ కు మద్దతు తెలిపారని.. అక్కడే కొనసాగుతారని అంతా భావించారు.కానీ ఆమెను ఏపీ కోసమే పార్టీలో చేర్చుకున్నారని తర్వాత తెలిసింది.
ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని షర్మిల సైతం చెప్పుకొచ్చారు. ఇప్పుడు పీసీసీ పగ్గాలు తీసుకోవడం ద్వారా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా గళం విప్పనున్నారు. అయితే షర్మిల రాకను గమనించిన జగన్.. కుటుంబాలను చీల్చేందుకు కూడా వెనకాడరని కౌంటర్ అటాక్ చేశారు.
తాజాగా గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల కిందటే ఆయన కీలక ప్రకటన చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. ఆమె నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టిడిపి, వైసీపీలో టిక్కెట్లు దక్కని వారు తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
గిడుగు రుద్రరాజు పార్టీలో సీనియర్. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి, కెవిపి రామచంద్ర రావుకు అత్యంత సన్నిహితుడు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్యశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా, 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా, 2012లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా కూడా పనిచేశారు. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించేందుకు.. రుద్రరాజు రాజీనామా చేశారు.
ఒకటి రెండు రోజుల్లో షర్మిల నియామక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.దీంతో జగన్ పై షర్మిల విమర్శలు చేసేందుకు వెనుకాడబోరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటున్న తరుణంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.