CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది..
ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది..
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది..
ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది..