మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ
దిల్లీ: ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ (Parliament) సెషన్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై వేటుపడిన సంగతి తెలిసిందే. ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన ర్యాలీ (protest march) చేపట్టారు..
పార్లమెంట్ (Parliament) భవనం నుంచి సెంట్రల్ దిల్లీలోని విజయ్ చౌక్(Vijay Chowk) వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాసిన బ్యానర్, ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ ర్యాలీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుండి నడిపించారు. అధికార భాజపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆయన విమర్శించారు. ”భద్రతా వైఫల్యంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కోరుతున్నాం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దీనిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలి. ప్రధాని లోక్‌సభ మినహా బయట మీడియాతో, సభల్లో దీని గురించి మాట్లాడారు. భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది..? ఎవరు బాధ్యులు..?” అని ఖర్గే ప్రశ్నించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన సభ్యులు శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నారని ఆయన చెప్పారు.