TRINETHRAM NEWS

నగదు, నగల తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు

రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి

సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి

కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు తెచ్చుకోవచ్చని వివరణ

లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదు, ఇతర విలువైన వస్తువుల తరలింపులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. తగు అనుమతులు, డాక్యుమెంట్లతోనే నగదు తరలింపు చేపట్టాలని సూచిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు తరలింపునకు అనుమతులు లేకపోతే దాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అధికారుల సూచనల ప్రకారం, అత్యవసరంగా ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించి రసీదులు (బ్యాంకు నుంచి తీసుకున్నవి, చెల్లింపులు సంబంధించిన పత్రాలు) వెంట పెట్టుకోవాలి. దుకాణంలో సరకులకు చెల్లించే మొత్తానికి సంబంధించి కొటేషన్ తప్పనిసరిగా ఉండాలి. నగల విషయంలో ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం కూడా కంపల్సరీ. బ్యాంకులకు నగదు రవాణా చేసే సంస్థలు సాయంత్రం వరకూ మాత్రమే నగదు తరలింపునకు అనుమతి ఉంటుంది. ఆసుపత్రుల్లో డబ్బు చెల్లింపులకు సంబంధించిన రసీదులు ఉండాలి. ఇక ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈఓ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు. నగదు, నగల తరలింపునకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు చూపించగలిగితే వాటిని వెనక్కు తెచ్చుకోవచ్చని అధికారులు వివరించారు.