TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా దర్శకులు, నిర్మాతలు, కళాకారులు, చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మంచి సినిమాలు తీస్తే సమాజం అందులోని మంచిని అనుకరించడం ప్రారంభిస్తుందన్నారు. శంకరాభరణం లాంటి చలనచిత్రాలు ఎంతో మందిని సంగీతం నేర్చుకునే విధంగా ప్రోత్సహించాయని చెప్పారు. అన్నమయ్య లాంటివి ఆ పదకవితా పితామహుని కీర్తనల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంచాయన్నారు. సినిమా వ్యాపారమే.. కానీ, ఆ వ్యాపారం సమాజానికి మేలు చేసేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటి తరానికి నచ్చే విధంగానే కాదు, తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలన్నారు.

50ఏళ్ల పాటు కొనసాగడం గొప్ప విషయం..

మురళీ మోహన్ సినీ జీవిత స్వర్ణోత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. సినిమా రంగంలో 50ఏళ్ల పాటు కొనసాగడం గొప్ప విషయమన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, నిజాయతీకి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితినైనా ఆనందంగా స్వీకరించే తత్వమే ఆయన అభ్యున్నతికి, ఆరోగ్యానికి కారణమన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా… తానో సగటు మనిషిని అని ఆయన అనుకుంటారని, అది చాలా మంచి లక్షణమని అన్నారు. మురళీమోహన్ నటన ఎంతో సహజంగా ఉంటుందని, ఇంట్లో వ్యక్తిలాగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. 50 ఏళ్ల క్రితం సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవారో…. ఇప్పటికీ అలానే ఉండటం జీవితంలో ఆయన పాటించే క్రమశిక్షణకు నిదర్శమని, ఆయన్ను చూస్తే ఎనిమిది పదులు నిండిన వ్యక్తిలా అనిపించరని తెలిపారు. వారు నటించిన, నిర్మించిన చిత్రాలు సందేశాత్మకంగా ఉండేవని అన్నారు.