TRINETHRAM NEWS

Covid Cases : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..వైద్యశాఖ అలర్ట్!

Telangana, Hyderabad : కరోనా మహమ్మారి విజృంభణ గురించి ఇప్పుడిప్పుడే జనాలు నెమ్మదిగా మర్చిపోతున్నారు. ఆర్ధిక వ్యవస్థ కూడా చిన్నగా మెరుగుపడుతుంది.

మన రోజువారీ జీవన విధానం మామూలు స్థితికి చేరుకుంది. అలాంటి సమయం లో ఇప్పుడు మళ్ళీ కరోనా మహమ్మారి చిన్నగా వ్యాప్తి చెందుతుంది అనే వార్త జనాల్లో కలవరం రేపుతోంది. దాదాపుగా 7 నెలల నుండి కోవిడ్ బులిటెన్ ని ఆపేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కరోనా కేసుల అప్డేట్స్ ఇవ్వడం ప్రారంభించింది. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం నుండి విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, మంగళవారం రోజు కొత్తగా నాలుగు కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి అని చెప్తున్నారు. దీంతో రాష్ట్రం లో ఇప్పటి వరకు యాక్టీవ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 9 కి చేరుకుంది. మొత్తం మీద 99 శాతం రికవరీ రేట్ ఉన్నట్టుగా ఈ బులిటెన్ ద్వారా తెలిసింది.

చలి కాలం ప్రారంభం అయ్యింది కాబట్టి రాబొయ్యే రోజుల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయట. దీంతో తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందిగా వైద్య శాఖా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు 60 ఏళ్ళు దాటిన వ్యక్తులతో సహా అవసరమైన బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, క్యాన్సర్ లేదా ఏదైనా ఇతర రోగాలతో బాధపడేవారు ఇక నుండి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. బయటకి ఎక్కడికి వెళ్లినా సామాజిక దూరం తో పాటుగా మాస్కులు కూడా ధరించమని చెప్తున్నారు. కరోనా ప్రతీ సీజన్ కి తన గుణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొత్త వేరియంట్స్ బయటకి వస్తున్నాయి. ఇలాంటి సమయం లో మన శరీరం లో యాంటీ బాడీస్ కూడా తట్టుకోలేనంత తీవ్రంగా కరోనా అటాక్ చెయ్యొచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.