Key discussion on 5 topics including farmer assurance
Trinethram News : తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమైన కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు, రుణ మాఫీ, రైతు భరోసా, హైడ్రాపై ఆర్డినెన్స్, కులగణన అంశాలపై చర్చించబోతోంది.
ఇంకా చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో జరగనుంది. ఈమధ్య తెలంగాణలో వరదలు వచ్చాయి కదా.. వాటిపై కూడా చర్చ ఉంటుంది. పంట నష్ట పరిహారం, పంటలకు బీమా వంటి అంశాలతోపాటూ.. కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది.
వర్షాలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కేబినెట్లో చర్చించి, ఆర్థిక సాయం ఎంత, ఎలా అందించాలనే అంశంపై నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్తగా తెచ్చిన ROR చట్టాన్ని కేబినెట్ ఆమోదించబోతోంది. ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం. దీని వల్ల ప్రతీ అంశానికీ రికార్డులు మెయింటేన్ చేస్తారు. తద్వారా పాలనలో పారదర్శకత మరింత పెరుగుతుంది.
ఇక రుణమాఫీ ఇప్పటికీ చాలా మంది రైతులకు అమలు కాలేదు. దాన్ని నెలాఖరులోగా అమలు చేస్తామంటున్నారు. అలాగే.. దసరా నాటికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం 2 లక్షల వరకూ రుణమాఫీని అమలు చేసింది. నెలాఖరు నాటికి 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని చెబుతోంది. ఐతే.. చాలా మంది రైతులకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కాలేదు. అందువల్ల ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై కేబినెట్లో లోతుగా చర్చ జరగనుంది.
హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రాకి చట్టబద్ధత లేదు అనే వాదన వినిపిస్తుండటం, ప్రస్తుతం హైడ్రా.. జీవో నంబర్ 99 ద్వారా కొనసాగుతుండటంతో.. ఇవాళ హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ.. ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో దీన్ని అసెంబ్లీ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది.
ఇక తెలంగాణలో కులగణన మరో కీలక అంశంగా మారింది. ఈ కుల గణనను 3 నెలల్లో పూర్తి చెయ్యాలని హైకోర్టు ఈమధ్యే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందువల్ల దీన్ని ఎలా చేపట్టాలి, ఎలా టైమ్ ప్రకారం పూర్తి చెయ్యాలి అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం చర్చించనుంది. త్వరలోనే దీనిపై గైడ్లైన్స్ జారీ చెయ్యనుంది.
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణలో భారీగా చర్చ జరుగుతోంది. వాటిని ఎప్పుడు ఇస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ రేషన్ కార్డులకూ, పథకాల అమలుకీ లింక్ ఉండటంతో.. వాటి అమలు ప్రభుత్వం ముందున్న సవాలుగా ఉంది. ఈ పని త్వరగా పూర్తి చెయ్యాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం గతేడాదే అప్లై చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App