చేతులు శుభ్రతతో వ్యాధులు దూరం
30 వేల మందిలో అవగాహన లేమి
వ్యక్తిగత పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరకుండా నివారించవచ్చు. ప్రమాదకరమైన వైరస్ బారినపడకుండా తప్పించుకోవచ్చు. ‘కొవిడ్-19’ తర్వాత ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగిందనే చెప్పాలి. కానీ, పాఠశాలల స్థాయిలో విద్యార్థులు క్రమంతప్పకుండా, తగిన విధంగా చేతులు శుభ్రం చేసుకోవడం లేదు. విద్యార్థులకు ఇదో దినచర్యగా అలవాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ గతంలో సూచించింది. అయినా ఆశించిన విధంగా ఇదెక్కడా అమలు కావడం లేదు. గతేడాది నవంబరులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) నిర్వహించిన సర్వే కూడా ఇదే తేల్చింది. యాజమాన్యాలు, జిల్లాస్థాయి అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తే విద్యార్థులు అనారోగ్యం పాలుకాకుండా చూడొచ్చు.
30 వేల మందిలో అవగాహన లేమి
విద్యార్థులు విధిగా కాళ్లు, చేతుల శుభ్రత పాటించేలా యాజమాన్యాలు పర్యవేక్షించాలి. ముఖ్యంగా చేతులపై క్రిములు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైపైన కడుక్కొని ఎవరైనా అల్పాహారం, ఆహారం తీసుకుంటే హానికర క్రిములు కడుపులో చేరి వ్యాధులు కలిగిస్తాయి. కొన్నిసార్లు అనారోగ్య తీవ్రత ముదిరితే మరణాలూ సంభవించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తిన్నాక నోటిని నీళ్లతో పుక్కిలించాలి. దీనివల్ల నోటి దుర్వాసన ఉండదు. పళ్లు శుభ్రంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో శుభ్రతపై అవగాహన కొరవడిన విద్యార్థులు 30,750 (15%) మంది ఉన్నట్లు ఎన్‌ఐఎన్ సర్వేలో తేలింది. వారు కూడా అలవాటుపడేలా పాఠశాలల నిర్వాహకులు చూడాలి. కావాల్సిన సబ్బులు, లిక్విడ్‌లను పాఠశాల గ్రాంట్స్ నుంచి సమకూర్చాలి.
చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా శరీరంలోకి క్రిములు చేరకుండా నివారించుకోవడం ముఖ్యం’ అని ఐక్యరాజ్య సమితి 2008లో ఉద్ఘాటించింది. ఆ ఏడాది అక్టోబరు 15 నుంచి ‘అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది.