TRINETHRAM NEWS

Trinethram News : దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ తేదీల్లో మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. అయితేపరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగానే మే 26వ తేదీన యథాతథంగా పరీక్ష జరుగుతుందని తన ప్రకటనలో స్పష్టం చేసింది.

తాజాగా మార్చిన తేదీల ప్రకారం మే 10 సాయంత్రం 5 గంటల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చింది. మే 17 నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి ఉంటాయని పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉదయం సెషన్‌లో జరుగుతుంది. పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో నిర్వహిస్తారు.

పరీక్ష అనంతరం అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ జూన్‌ 2న విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ, ఫలితాలను జూన్‌ 9వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జూన్‌ 10వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది.