TRINETHRAM NEWS

కొత్తేడాది తొలి రోజే ఇస్రో ప్రయోగం.. నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ-58

కొత్త ఏడాది తొలిరోజే కీలకమైన రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. బ్లాక్ హోల్స్‌పై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగానే PSLV- C58 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్స్-రే పోలారిమెట్రీ ఉపగ్రహాన్ని ఇది అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.

కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించింది ఇస్రో…కొత్త సంవత్సరం తొలిరోజే ఓ భారీ విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకుంది.శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇక బ్లాక్‌హోల్స్ రహస్యాల్ని ఛేదించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలారిమెట్రి మిషన్ చేపట్టింది. విశ్వంలో మిస్టరీగా మారిన బ్లాక్‌హోల్స్‌ అని పిలుచుకునే కృష్ణబిలాల అన్వేషణ కోసం ఇస్రో అతిముఖ్యమైన ప్రయోగం చేపట్టింది..అంతరిక్షంలోని 50 కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు. ఈ కాంతిపుంజాల్లో బ్లాక్‌హోల్, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, యాక్టివ్‌గా ఉన్న పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్‌నోవాల అవశేషాలు ఉన్నాయి. వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది. ఇలాంటిది ఇప్పటివరకూ అమెరికా మాత్రమే చేస్తోంది. ఇప్పుడు రెండో దేశంగా భారత్ నిలుస్తోంది..ఈ శాటిలైట్ 5 ఏళ్లు పనిచేయగలదు.

బ్లాక్‌హోల్స్ అనేవి డైరెక్టుగా చూస్తే కనిపించవు. వాటి చుట్టూ ఉన్న కాంతిని బట్టీ, అవి బ్లాక్‌హోల్స్ అని అర్థం చేసుకుంటారు. ఐతే, బ్లాక్‌హోల్‌లో ఏముంది? ఆ కన్నం చుట్టూ ఎందుకు కాంతి తిరుగుతూ ఉంటుంది. ఆ కన్నంలోని ఏ శక్తి కాంతిని కూడా తనవైపు లాక్కోంటోంది? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. వీటిపై ఇప్పటివరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఆన్సర్లు కనుక్కోలేకపోయింది. అందుకే ఇస్రో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కాంతిపుంజాలను పరిశోధించడం ద్వారా విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలు తెలిసే అవకాశముంది..అలాగే బ్లాక్ హోల్స్ తీరుపై మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.ఈ ప్రయోగంతో ఏదైనా కనిపెట్టి, త్వరలో గుడ్ న్యూస్‌ చెప్పాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు..