In public schools as opposed to private ones
*బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా ఉపాధ్యాయుల కృషి
*పాఠశాలలోని గ్రంథాలయానికి 10 వేల రూపాయల విరాళం ప్రకటన
*అమర్ నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి, జూన్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రజలంతా తమ పిల్లలను నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు.
శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లిలోని అమర్ నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేశారు.
పాఠశాలకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పాఠశాలను ఆసాంతం పరిశీలించిన ఎమ్మెల్యే అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో నిర్మించిన రీడింగ్ కార్నర్ రూమ్ ను, తరగతి గదులలో ఏర్పాటు చేసిన ఐవిపి ప్యానెల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా *పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, జూన్ 6 నుంచి జూన్ 19 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రతి పిల్లవాడు పాఠశాలల్లో నమోదు అయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారని, గతంలో నిర్వీర్యమైన ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం 1100 కోట్ల ఖర్చుచేసి పునరుద్ధరించి, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని వసతులు విద్యార్థులకు కల్పించామని అన్నారు.
ప్రస్తుతం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారని, వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావాలని, అనవసరంగా ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపి డబ్బు వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పాఠశాలలో వచ్చే చిన్న, చిన్న సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని ఆ సమస్యల సత్వర పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో ఉన్న గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గ్రంథాలయంలో మంచి పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థుల కోసం అందించేందుకు పదివేల రూపాయలను సొంత నిధుల నుంచి విరాళం ప్రకటించారు.
అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలచే అక్షరాభ్యాసం ఎమ్మెల్యే చేయించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి డి.మాధవి, మండల విద్యాశాఖ అధికారి సురేందర్, ప్రధానోపాధ్యాయులు మంజులత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్, పంచాయతీ సెక్రెటరీ, ఎంపిఓ zptc బండారు రామ్మూర్తి,ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు