TRINETHRAM NEWS

CBN: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది: చంద్రబాబు

Trinethram News : 7th Jan 2024 : తిరువూరు:

వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్‌ (YS Jagan) దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు..

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

”ఓ పక్క హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. మరో పక్క అమరావతి వెలవెలబోతోంది. దీనికి కారణం జగన్‌ రివర్స్‌ పాలన. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం.. ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుంది. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నా..

మూడు నెలల్లో రైతు రాజ్యం

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేది నా ఆకాంక్ష. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు తెదేపా ఉపయోగపడింది. వైకాపాకు ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్లవుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు.. ధాన్యం రైతులు దగాపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రైతుల బతుకులు బాగుపడాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలి. సైతాన్‌ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి. మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది..

మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొంటారు..

ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రుషికొండను బోడిగుండు చేసి రూ.500కోట్లతో ప్యాలెస్‌ కట్టారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుంది. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది. తెదేపా హయాంలో ఉద్యోగాలు వస్తే.. జగన్‌ గంజాయి తెచ్చారు. యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా. రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నంబర్‌ వన్‌గా మారుస్తా.

త్వరలో తెదేపా-జనసేన మేనిఫెస్టో

దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామని వైకాపా నేతలు అనుకుంటున్నారు. ఆ పార్టీ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలి. సంక్షేమ పథకాలకు నాంది పలికింది తెదేపా. జగన్‌ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్‌ సిక్స్‌ అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తాం. ‘అన్నదాత’ కింద రైతులకు రూ.20వేలు అందజేస్తాం. ‘జయహో బీసీ’ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం. తెదేపా-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం.

అంబటి రాయుడును మోసగించారు

సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్‌ నమ్మడం లేదు.. ప్రజలు ఆయన్ను నమ్మట్లేదు. ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవు. గుంటూరు ఎంపీ టికెట్‌ పేరుతో అంబటి రాయుడును మోసగించారు. ఆ టికెట్‌ను మరొకరికి కేటాయించడంతో ఆయన వైకాపా నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రజలకు సేవ చేసిన వారికి వైకాపా సీట్లు ఇవ్వలేదు. నన్ను, పవన్‌, లోకేశ్‌ను దూషిస్తేనే టికెట్లు ఇస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ సిద్ధం కావాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.