Hydra on one side.. Loan waiver on the other side.. Revanth Sarkar suffocation
Trinethram News : తెలంగాణ : తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వంపై ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ ఏకకాలంలో దాడి చేస్తున్నాయి. రెండూ కూడా రెండు అంశాలను తీసుకుని రేవంత్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తతుం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా చుట్టే రాజకీయం నడుస్తున్నది. హైడ్రాపై ప్రజా వ్యతిరేకతను దన్నుగా తీసుకుని బీఆర్ఎస్ మళ్లీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి శతధా ప్రయత్నిస్తోంది. రేవంత్ సర్కార్ ను ప్రజలలో పలుచన చేయడానికి హైడ్రా తిరుగులేని ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా విస్మరించింది.
హైడ్రాకు ముందు బీఆర్ఎస్ రుణమాఫీ అంశంపై ప్రభుత్వంతో యుద్ధానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదంటూ రేవంత్ ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ భవన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. అయితే ఎప్పుడైతే హైడ్రా తెరమీదకు వచ్చిందో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అలా పక్కన పడేయడానికి రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ను జనం నమ్మకపోవడమే. బీఆర్ఎస్ ప్రకటించిన కార్యాచరణకు రైతుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే హైడ్రా తెరమీదకు రావడంతో రుణమాఫీని వదిలేసి బీఆర్ఎస్ హైడ్రాకు వ్యతిరేకంగా పోరు మొదలెట్టింది. ఇందుకు ప్రజల నుంచి కూడా స్పందన లభించడంతో ఇక రైతు రుణమాఫీ ముగిసిన అంశంగా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడే బీజేపీ రుణమాఫీ విషయాన్నిఅందిపుచ్చుకుంది. రైతు సమస్యలపై పోరుబాటకు రెడీ అయిపోయింది. అయితే హైడ్రా ద్వారా వచ్చిన అవకాశాన్ని చేజేతులా బీఆర్ఎస్ కు అప్పగించేసి రుణమాఫీ అంటూ బీజేపీ హడావుడి చేయడాన్ని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ రైతులు రుణమాఫీని పొంది ఆనందంగా ఉన్నారు. రుణమాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో రైతు సమస్యలంటూ బీజేపీ పోరుబాట పడితే.. ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదన్నది వారి వాదన.
అయితే బీజేపీ హైడ్రా విషయంలో కేవలం విమర్శలు, ఆరోపణలకే పరిమితమై.. బీఆర్ఎస్ చేతకాక చేతులెత్తేసిన రైతు సమస్యలను సీరియస్ గా పట్టించుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని పార్టీ శ్రేణులు అభ్యంతరం చెబుతున్నా.. నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే బీఆర్ఎస్ తో సమాంతరంగా నిత్యం క్షేత్ర స్థాయిలో పోరుబాటలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ రేవంత్ సర్కార్ పై వేర్వేరు అంశాలతో పోరుబాట పట్టాయి. దీంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.