Trinethram News : ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్ డీజీపీ మహేందర్‌రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్‌రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే సంపదను పోగు చేసుకున్నారు. మహేందర్‌రెడ్డి చేసిన అక్రమాల్లో 40 వాటికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్న రాపోలు భాస్కర్ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌లకు ఫిర్యాదులు చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఆయన మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయనిఅనుమానాలను వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో పాటు పలువురు అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్న మహేందర్‌రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్తదితర జిల్లాల్లో కొంత మంది పోలీసు అధికారులను ఉపయోగించుకుని పెద్ద సంఖ్యలో భూములను తన పేర, తన బినామీల పేర మార్చుకుని రియల్టర్లకు డెవెలప్మెంట్కు ఇవ్వడం ద్వారా రూ.వందల కోట్లు సంపాదించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాపోలు భాస్కర్చేసిన ఫిర్యాదులోని అంశాలు ఇలా..
టాలీవుడ్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెకు ప్రస్తుతం గండిపట మండలం పరిధిలో ఉన్న వట్టినాగులపల్లిలో 11.33 ఎకరాల భూమి ఉండేదని రాపోలు భాస్కర్తన ఫిర్యాదులో తెలిపారు. ఈ భూమికి సంబంధించి సౌందర్య సోదరుడు అమర్నాథ్, వేలిముద్రలను ఫోర్జరీ చేసి యలమంచి బసవేశ్వరరావు అనే వ్యక్తికి సేల్డీడ్చేశారని పేర్కొన్నారు. దాంట్లో మహేందర్ రెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ వీ.వీ. రమణ, సోదరుడు వెంకట్‌రెడ్డి, సోదరుడి కుమారుడు చెన్నారెడ్డి, సోదరుడి మరో కుమారుడు మోహన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సౌందర్య సోదరుడు అమర్నాథ్ను గ్యాంగ్స్టర్నయీంతో బెదిరింపులకు గురి చేసినట్లుగా తెలిపారు. ఈ ఆరోపణకు సంబంధించి రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లను ఫిర్యాదుకు జత చేశారు.
సైబరాబాద్ సీపీగా పని చేసినప్పుడు హైదర్‌నగర్ ప్రాంతంలోని సర్వే నెం.163లో ఉన్న దుర్గామాత సొసైటీ, ఐడీపీఎల్ సొసైటీల్లో రూ.500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 60 ప్లాట్లను బినామీల పేర్లతో కబ్జాలు చేసినట్లు ఆరోపించారు. కొంతకాలం క్రితం తన కూతురి పెళ్లి చేసిన మహేందర్‌రెడ్డి, తన అల్లుడితో వివాదాస్పద భూముల్లో రియల్‌దందా జరిపిస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. హయత్‌నగర్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో 600 ఎకరాలకు సంబంధించి జరిగిన డీల్‌లో మహేందర్‌రెడ్డి అల్లుడు ఉన్నారని ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహేందర్‌రెడ్డి ఆ డీల్‌ను అల్లుడికి కట్టబెట్టారని పేర్కొన్నారు.
హైదరాబాద్కమిషనర్గా పని చేసినపుడు సీసీఎస్ పాత భవనాన్ని కూల్చి వేయించి, కొత్త భవనాన్ని కట్టించినట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి కేవలం రూ.8 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, రూ.16 కోట్లు ఖర్చయినట్టుగా బిల్లులు తయారు చేయించారని తెలిపారు. ఈ బిల్లులకు సంబంధించిన ఫైళ్లపై, సంతకాలు చేయాలని అప్పట్లో సీసీఎస్ డీసీపీగా ఉన్న అవినాష్మహంతిపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ ఫైళ్లపై సంతకాలు చేసేది లేదని అవినాష్‌మహంతి చెప్పారని వెల్లడించారు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించి అవినాష్ మహంతిని సెలవుపై పంపించి, ఆ స్థానంలో ప్రభాకర్‌రావును నియమించి సంతాకాలు చేయించుకున్నారని గుర్తు చేశారు.
సీసీ కెమెరాల ప్రాజెక్టులో కూడా మహేందర్‌రెడ్డి భారీ అవినీతికి పాల్పడినట్టు రాపోలు భాస్కర్ఆరోపించారు. అత్యంత గోప్యంగా కొనసాగించిన ఈ వ్యవహారాన్ని తన అస్మదీయులైన శ్రీనాథ్‌రెడ్డి, రాంరెడ్డి, విజయ్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, మల్లారెడ్డి (అందరూ ప్రైవేట్‌వ్యక్తులు)తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి నడిపించారని తెలిపారు. కర్నూలు ఎస్పీగా పని చేసినపుడు వేర్వేరు నేరాల్లో సీజ్చేసిన వాహనాలను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కేసులు కూడా నమోదు చేశారని తెలిపారు. తన బలంతో కేసు దర్యాప్తు ముందుకు కొనసాగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ పెండింగ్‌లోనే ఉన్నట్లుగా తెలిపారు.
చేవెళ్ల ప్రాంతంలో తన సోదరుని కుమారుడు, ఇతర బంధువుల పేరన 5,000 కోట్ల రూపాయల విలువ చేసే 106 ఎకరాల వ్యవసాయ భూమిని మహేందర్‌రెడ్డి కొన్నట్టుగా తెలియచేశారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామంలో సర్వే నెంబర్లు 12, 13, 14, 17, 18, 19, 20ల్లో ఉన్న 6,000 కోట్ల రూపాయల విలువ చేసే 74 ఎకరాల భూములను తన సమీప బంధువుల పేర కొన్నట్టు తెలిపారు. మార్కెట్రేట్ప్రకారం ప్రస్తుతం ఈ భూముల విలువ 10,000 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ భూములు ఎవరెవరి పేరన ఉన్నాయన్న వివరాలు బయటకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులను మేనేజ్చేసినట్టుగా తెలిపారు.
చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లిలో సర్వే నెం.70లో రూ.25,000 కోట్లకు పైగా విలువ చేసే 100 ఎకరాల భూమిని ఓ కెమికల్లిమిటెడ్కంపెనీ పేర కొన్నట్లుగా తెలిపారు. ఈ కంపెనీలో మహేందర్‌రెడ్డి స్లీపింగ్పార్ట్నర్ అని పేర్కొన్నారు. చేవెళ్ల మండలం నాంచేరి గ్రామంలో రూ.30,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 250 ఎకరాల భూములను తన బంధువులు, అనుచరుల పేర కొన్నట్లుగా తెలిపారు. గ్యాంగ్స్టర్నయీంతో మహేందర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవని రాపోలు భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం పోలీస్‌శాఖలో పనిచేస్తున్న అందరికీ తెలిసిందేనని అన్నారు. నయీంను అడ్డం పెట్టుకుని యాదగిరిగుట్ట మండలం రాయగిరి గ్రామంలో 18.05 ఎకరాల భూమిని తన పేరన రిజిస్ర్టేషన్ చేయించుకున్నట్లుగా పేర్కొన్నారు. నయీం ఎన్కౌంటర్తరువాత అతడికి మహేందర్‌రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి పలు ఆధారాలు దొరికాయని తెలిపారు. పెద్దల పరిచాయాలను ఉపయోగించి ఆ ఆధారాలు బయటకు రాకుండా చూశారని తెలిపారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు ఆయనకు సహకరించినట్లుగా ఆరోపించారు.
జేఎన్టీయూ క్యాంపస్ వద్ద రూ.కోట్లు విలువ చేసే రెండు బహుళ అంతస్తుల భవనాలను మహేందర్‌రెడ్డి కొన్నట్టు తెలిపారు. అదేవిధంగా సైదాబాద్కాలనీలోని వెంకటేశ్వర ఆలయం ప్రాంతంలో రెండంతస్తుల భవనం కూడా ఆయన కొన్నట్టు పేర్కొన్నారు. మలక్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీలో తన పేర, తన కుటుంబ సభ్యుల పేర మొత్తం 4 ఇండ్లను కొన్నట్టుగా వివరించారు. అమీర్‌పేట ప్రాంతంలో తన పేర, తన బినామీల పేర ఓ వాణిజ్య భవనాన్ని కూడా కొన్నారన్నారు. దిల్సుక్నగర్ప్రాంతంలో జీ ప్లస్ 4 అంతస్తుల మరో వాణిజ్య భవనం కూడా కొన్నట్టు తెలిపారు. నిజాంపేటలో 200 కోట్ల రూపాయల విలువ చేసే 2 ఎకరాల భూమిని తన బినామీల పేర కొని పెట్టినట్టు పేర్కొన్నారు. అదే ప్రాంతంలో తన పేర, తన బినామీల పేర రెండు లగ్జరీ ఫ్లాట్లు కూడా కొన్నారన్నారు.
ఇక, తన స్వగ్రామమైన కిస్టాపూర్లో 100 ఎకరాల మామిడి తోటను కొని అందులో ఫాంహౌస్కట్టించుకున్నట్టుగా తెలిపారు. మోకిలా, శంకర్పల్లి, తెల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, వట్టినాగులపల్లి రతదిర ప్రాంతాల్లో బినామీల పేర వందల ఎకరాల భూములను కొన్నట్టుగా తెలియచేశారు. వికారాబాద్మండలం బూరుగుపల్లి గ్రామంలో తన బంధువుల పేర 500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 200 ఎకరాల వ్యవసాయ భూములను కొన్నట్టుగా తెలిపారు. వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలోని గౌలిదొడ్డిలో సర్వే నెంబర్431/432లో లావణ్య పట్టా ఉన్న 10 ఎకరాల భూమిని తన సోదరుడు రామచంద్రయ్య రెడ్డి పేరన రిజిస్ర్టేషన్ చేయించినట్టు పేర్కొన్నారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్‌విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందన్నారు. తన మామ పేరన బోడుప్పల్ మేడిపల్లిలో 8 ఎకరాల భూమిని కొన్నట్టు పేర్కొన్నారు. శంషాబాద్ప్రాంతంలోని మదనపల్లిలో 500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 14 ఎకరాల భూమిని తన పేర, తన బంధువుల పేర కొన్నట్టుగా వివరించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో 25 ఎకరాల మామిడి తోట, మహబూబ్‌నగర్‌టౌన్ సమీపంలో మరో 80 ఎకరాల భూమిని తన పేర, బంధువుల పేర కొన్నట్టు తెలిపారు. తన మామ సుధాకర్‌రెడ్డి పేర కల్వకుర్తి తలకొండపల్లిలో 66 ఎకరాల మామిడి తోటను కొన్నట్టు పేర్కొన్నారు. తన సడ్డకుని పేర తోల్కట్ట కేతిరెడ్డిపల్లిలో 10 ఎకరాల భూమిని కొన్నట్టు తెలిపారు. మొయినాబాద్మండలం అజీజ్నగర్గ్రామంలో 12 ఎకరాల ఫాంహౌస్‌ను కూడా కొన్నట్టు తెలియచేశారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో సర్వే నెంబర్లు 48, 83, 168ల్లో ఉన్న దాదాపు వంద ఎకరాల భూమిని కూడా మహేందర్‌రెడ్డి దక్కించుకున్నట్టుగా ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పటాన్చెరు ప్రాంతంలో 50 ఎకరాల కమర్షియల్ ల్యాండ్‌ను కొన్నట్టు తెలిపారు. దాంతోపాటు రాయదుర్గం గ్రామంలో మరో 15 ఎకరాల భూమిని కొని ప్లాట్లుగా చేయించి అమ్మించారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి అమీన్పూర్ప్రాంతంలోని ఐలాపూర్‌లో వివాదంలో ఉన్న 800 ఎకరాల భూ వివాదాన్ని సెటిల్చేశారన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి మెదక్ఎస్పీ సుమతి ఆయనకు సహకరించినట్టుగా ఆరోపించారు. శంషాబాద్మండలం ముచ్చింతల్‌లో 40 ఎకరాల భూమిని కొని కొంతకాలం క్రితం ఓ రియల్ఎస్టేట్సంస్థకు డెవలప్మెంట్నిమిత్తం ఇచ్చారని తెలిపారు. నల్గొండ జిల్లా సర్వేల్లోని రెసిడెన్షియల్స్కూల్లో తాను కొండారెడ్డి (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వాన్నంటూ నకిలీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చి అడ్మిషన్ తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందగా సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారులు విచారణ జరిపారని, దీంట్లో మహేందర్‌రెడ్డి తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించినట్టుగా నిర్ధారణ కూడా అయ్యిందని వివరించారు. జూబ్లీహిల్స్ ప్రశాంత్‌నగర్‌లోని 117 నెంబర్ప్లాట్లో కట్టుకున్న ఇంటి ప్రధాన ద్వారం కోసం రౌడీషీటర్అయిన అంబర్‌పేట శంకర్నుంచి ఎర్ర చందనం కలపను తెప్పించుకున్నట్టు తెలియచేశారు. దాంతోపాటు విలువైన మార్భుల్బండలను కూడా తెప్పించుకున్న మహేందర్‌రెడ్డి దీనికి ప్రతిగా అంబర్‌పేట శంకర్‌పై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తి వేయించారన్నారు.
మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించటంలో ప్రధాన పాత్ర పోషించానంటూ గ్యాలంటరీ మెడల్‌ను తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై కొందరు కోర్టుకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో సీఐడీ అఇకారులు కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఐజీ ఇంటెలిజెన్స్‌గా మహేందర్‌రెడ్డి పని చేశారన్నారు. ఆ సమయంలో నిరుద్యోగ యువతకు శిక్షణ పేర యువ కిరణాలు అన్న పథకాన్ని తీసుకొచ్చి, ఆ బాధ్యతను అసెంట్లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థకు ఇచ్చారన్నారు. అయితే, ఈ సంస్థ యువతకు పెద్దగా శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. శిక్షణ ఇవ్వకున్నా 500 కోట్ల రూపాయలను స్వాహా చేశారన్నారు. తన బంధువుల పేర అమెరికాలో ఓ సాఫ్ట్వేర్కంపెనీని ప్రారంభించినట్టు తెలిపారు. దీని వ్యవహారాలను మహేందర్‌రెడ్డి కుమారుడు చూసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
వీళ్లే బినామీలు….
అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహేందర్‌రెడ్డి లక్ష కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను సమకూర్చుకున్నట్టుగా ఫిర్యాదు చేసిన అడ్వకేట్ రాపోలు భాస్కర్, ఆయన బినామీల పేర్లను కూడా ఉదహరించారు. మహేందర్‌రెడ్డికి బినామీలుగా ఆయన సోదరుడు ఎం.వెంకట్‌రెడ్డి, అతని కుమారుడు ఎం.చెన్నారెడ్డి, మరో కుమారుడు మోహన్‌రెడ్డి, తోడళ్లుల్లు గోవర్ధన్‌రెడ్డి, బానాల చలపతి రెడ్డి, సీసీ కెమెరాల వ్యాపారంలో భాగస్వామి అయిన మల్లారెడ్డి, భార్య అనిత, సోదరుడు రామచంద్రయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా కౌన్సిల్ఛైర్మన్గా పని చేసిన కే.సీ.రెడ్డి, కాంగ్రెస్‌నాయకుడు కావూరి సాంబశివరావు, ప్రైవేట్వ్యక్తులైన జీవన్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, పోలీసు అధికారులు శ్రీనాథ్‌రెడ్డి, రాంరెడ్డి, జంగయ్యలు ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.