TRINETHRAM NEWS

RGV Vyooham: ‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దయ్యిందా? డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఏమన్నారంటే?

ఇటీవల సెన్సార్‌ అనుమతి లభించడంతో డిసెంబర్‌ 29న వ్యూహం మూవీ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్‌ వర్మ. అయితే అదేమీ జరగలేదు. వ్యూహం సినిమా రిలీజ్‌పై మళ్లీ కోర్టు మెట్లెక్కారు ఏపీ టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు. వీరి పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్‌ డ్రామా నవంబర్‌ 10నే విడుదల కావాల్సింది. అయితే టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు వర్మ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకులను కించపరిచేలా వ్యూహం సినిమా ఉందంటూ సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యూహం రిలీజ్‌ వాయిదా పడింది. అయితే ఇటీవల సెన్సార్‌ అనుమతి లభించడంతో డిసెంబర్‌ 29న వ్యూహం మూవీ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్‌ వర్మ. అయితే అదేమీ జరగలేదు. వ్యూహం సినిమా రిలీజ్‌పై మళ్లీ కోర్టు మెట్లెక్కారు ఏపీ టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు. వీరి పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు రిలీజ్‌ కావల్సిన ఆర్జీవీ మూవీ మరోసారి పోస్ట్‌ పోన్‌ అయ్యింది.

అయితే సోషల్‌ మీడియాలో ఆర్జీవీ వ్యూహం సినిమాపై కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ను హైకోర్టు రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు వర్మ. వ్యూహం సెన్సార్‌ రద్దు అంటూ వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు కాలేదు. వాస్తవం ఏమిటంటే.. సీబీఎఫ్‌సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని మాత్రమే కోర్టు అడిగింది’ అని ట్వీట్‌ చేశారు డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. వ్యూహం సినిమాలో సీఎం జగన్‌ పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ పోషించారు. అలాగే వైఎస్‌ భారతి రోల్‌లో నటి మానస కనిపించనుంది. రామ దూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ వ్యూహం సినిమాను నిర్మించారు.