Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12 కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
కృష్ణా జలాలపై కేసీఆర్ గొంతు విప్పడం వల్లే.. బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండలో సభ పెట్టబోతున్నది కాబట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదని, కానీ కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లోనే అప్పగించడానికి అవసరమైన అన్ని సంతకాలు పెట్టి వచ్చారని విమర్శించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత లొల్లి పెట్టినా, అరిచినా ఇది దాగని సత్యమని పేర్కొన్నారు. తీర్మానంలోని రెండు, మూడు అంశాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని స్పష్టం చేశారు.
అది అవాస్తవాల పుస్తకం
కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కృష్ణా జలాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. ప్రజలకు, సభకు నిజాలు చెప్పేందుకు తమకు కూడా ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరితే ఇవ్వకపోవడం బాధాకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు’ పేరుతో ప్రభుత్వం సభ ముందు ఉంచిన పుస్తకానికి ‘అవాస్తవాలు’ అని పేరు పెడితే సరిగ్గా ఉండేదని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పిన అబద్ధాలకు, అవాస్తవాలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అవాస్తవం 1: కేంద్ర జల్‌శక్తి అధ్యక్షతన 6-10-2020న జరిగిన రెండో అపెక్స్ కమిటీలో గత ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల అప్పగింతపై ఒప్పుకొన్నారు. వాస్తవం: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మీటింగ్ మినిట్స్ ప్రకారం నీళ్ల వాటా లెక్క తేల్చే వరకు కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయించే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ట్రిబ్యునల్ అంశం సుప్రీంకోర్టులో ఉన్నదని పేర్కొన్నారు.
అవాస్తవం 2: కేంద్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ను గత ప్రభుత్వం సవాల్ చేయలేదు. ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా కృష్ణా ప్రాజెక్టులను అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకొన్నది.
వాస్తవం: ఇది తప్పు అనడానికి ప్రస్తుత ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖనే సాక్ష్యం. కేఆర్‌ఎంబీ 17వ సమావేశం మినిట్స్ ప్రకారం కేఆర్‌ఎంబీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను రివ్యూ చేయాలని, దీనిపై నిర్ణయం తీసుకొనే అధికారం లేదని, దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలని మినిట్స్‌లో స్పష్టం చేశారు. అలాగే, కార్యదర్శి రాహుల్ బొజ్జా 27-01-2024 రాసిన లేఖలో అప్పటి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని 15-07-2021న లేఖ రాసినట్టు తెలిపారు.
అవాస్తవం 3: 6-05-2022న జరిగిన 16వ కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు నీటి నిర్వహణ నియమావళిని ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేస్తామని ఒప్పుకొన్నారు.
వాస్తవం: ఇది కూడా అసత్యం అనడానికి రాహుల్ బొజ్జా రాసిన లేఖనే సాక్ష్యం. 16వ కేఆర్‌ఎంబీ సమావేశంలో అపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకుండా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోబోమని అప్పటి ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ప్రభు త్వం తేల్చి చెప్పింది. దీన్ని అపెక్స్ కౌన్సిల్‌కు రెఫర్ చేయాలని 17వ కేఆర్‌ఎంబీ సమావేశంలో స్పష్టం చేసిందని రాహుల్ బొజ్జా కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
అవాస్తవం 4: తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణా నదీ జలాలను, ప్రాజెక్టులను ఏనాడు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కనాడు కూడా వ్యతిరేకించలేదు.
వాస్తవం: రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆ నిబంధనలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పినట్టుగా సమావేశం మినిట్స్ ఉన్నాయి. నీటి వాటాల పంపకంలో 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని ఇప్పటి వరకు 27 లేఖలు రాశాం.
కృష్ణా ప్రాజెక్టులపై చర్చ మాజీ మంత్రి హరీశ్‌రావు వర్సెస్ మంత్రి ఉత్తమ్ అన్నట్టుగా సాగింది. ఈ ఇద్దరి మధ్య తీవ్ర సంవాదం జరిగింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో తప్పుడు అంశాలు చెప్పినట్టు హరీశ్‌రావు ఆరోపించారు. అదే విధంగా వాస్తవాల పేరుతో వేసిన పుస్తకంలోనూ అన్నీ అవాస్తవాలనే పొందుపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ప్రశ్నలకు దీటైన సమాధానాలతో హరీశ్‌రావు కుండబద్ధలు కొట్టారు.
హరీశ్‌రావు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17-01-2024న ఢిల్లీలో కేంద్ర జలవనరుల కార్యదర్శి వద్ద సమావేశం జరిగింది. ఇందులో ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకొన్నది. ఈ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు అవసరమైన ప్రణాళికతో 7 రోజుల్లో వస్తాం. అదే విధంగా నెల రోజుల్లో ఈ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తాం. సాగర్ డ్యాం వద్దకు వెళ్లాలంటే కేఆర్‌ఎంబీ అనుమతి కావాలి. బోర్డుకు రాష్ట్రాలు డబ్బులు ఇస్తాయి. వీటన్నింటికీ ఒప్పుకొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఉత్తమ్: దీనిపై మా ప్రభుత్వం సంతకం చేయలేదు. మా ప్రభుత్వం తరుఫున కార్యదర్శి కూడా సంతకం చేయలేదు. ఎక్కడి నుంచో డాక్యుమెంట్ తీసుకొచ్చి చెబితే ఎలా.
హరీశ్‌రావు: బాధ్యతగల మంత్రి పదవిలో ఉంటూ కేంద్రం ఇచ్చిన మినిట్స్‌ను ఎక్కడి నుంచో తీసుకొచ్చారనడం బాగాలేదు.
ఉత్తమ్: కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటాను 299:512 టీఎంసీలుగా 2015 నుంచి 2022 వరకు ఒప్పుకొని ఇప్పుడు రాజకీయంగా 50:50 అడుగుతున్నరు. అంతకుముందు 50:50 నిష్పత్తి ఎందుకు అడగలేదు. వాస్తవంగా రావాల్సిన 68:32 ఎందుకు అడగడం లేదు.
హరీశ్‌రావు: మా ప్రభుత్వం నిరుడు మాత్రమే 50:50 నిష్పత్తిలో వాటా అడిగిందని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాలతో మాపై బురద జల్లాలని సిద్ధమై వచ్చినట్టున్నారు. కానీ బురద చల్లించుకునేందుకు మేం సిద్ధంగా లేం. బయటకు వెళ్లడానికి సిద్ధంగా లేం. ప్రతి దానికి సమాధానం చెప్తాం. 07-07-2018న అప్పటి సీఎస్ ఎస్‌కే జోషి 50:50 కావాలని గత కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలి.
వారం వరకు ఎందుకు లేఖ రాయలేదు?
ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినట్టు కేఆర్‌ఎంబీ సమావేశమైన మరుసటి రోజు అంటే 18వ తేదీన అన్ని వార్తా పేపర్లలో దీని వల్ల జరిగే నష్టంపై పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే ఆ వార్తల్ని ఖండించాలి కదా? ఎందుకు ఖండించలేదు. 19వ తేదీన నేను విలేకరుల సమావేశం నిర్వహించి ఓవైపు కేంద్రం ప్రాజెక్టులను తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతున్నదా? అని ప్రశ్నించా. తాము కేంద్రానికి లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సమావేశం పూర్తై నిర్ణయం తీసుకొన్న 10 రోజులు తర్వాత లేఖ రాశారు. అది కూడా మా పార్టీ లొల్లిపెట్టి.. కేసీఆర్ ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేసి నల్లగొండ సభ నిర్ణయించిన తర్వాత జనవరి 27న ఈ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సమావేశం మినిట్స్ వెలువడిన 10 రోజుల వరకు నిద్రపోతున్నారా? ఒకవేళ మినిట్స్ తప్పయితే మరుసటి రోజే ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టి ఖండించలేదు. 19న మినిట్స్ బయటకొస్తే 20న లేదా 21న లేఖ ఎందుకు రాయలేదు. సకాలంలో మీరు లేఖ రాయలేదంటే ప్రాజెక్టులపై మీ నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమైతున్నది. లేఖ రాయలేదంటే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు ఒప్పుకొన్నట్టే కదా?
ప్రాజెక్టులు అప్పగించినట్టు ఈఎన్సీలే చెప్పారు
హరీశ్‌రావు: ఫిబ్రవరి 1న కేఆర్‌ఎంబీ రెండో సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో మళ్లీ ప్రాజెక్టును బోర్డుకు అప్పగిస్తామని చెప్పారు. దీంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను వారం రోజుల్లో కేటాయిస్తామని, వారికి వేతనాలను తమ ప్రభుత్వాలే చెల్లిస్తాయని ఒప్పుకొన్నారు. ఈ మీటింగ్ తర్వాత రెండు రాష్ర్టాల ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్‌రావు బయటికొచ్చి ప్రాజెక్టుల ఆపరేటింగ్‌ను అప్పగిస్తామని ఒప్పుకొన్నారు. ఇందుకు వీడియోనే సాక్ష్యం.
ఉత్తమ్: చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేను, సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులను అప్పగించలేదని చెప్తుంటే ఆ ఇంజనీర్ ఇలా అన్నారు.. అటెండర్ అలా అన్నారు అంటే ఎలా? కామన్‌సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు.
హరీశ్‌రావు: ఉత్తమన్న ఫ్రస్టేషన్‌ను నేను అర్థం చేసుకుంటా. ఆయన పుట్టు కాంగ్రెస్‌వాది. ఆరేడుసార్లు గెలిచి ముఖ్యమంత్రి కాకపోతిననే రంది ఉన్నది.
ఉత్తమ్: ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఆ చిల్లర మాటలెందుకు. ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు పట్టుకొని మాట్లాడుతూ… గ్రామ పంచాయతీలా చేస్తున్నారు.
హరీశ్‌రావు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గ్రామ పంచాయతీలంటే అంత చులకనా? గ్రామ పంచాయతీల్లో మంచి చర్చలు జరగవా? నేను తెచ్చిన పత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినవే.
ఆ రెండూ తొలగిస్తే సంపూర్ణ మద్దతు
హరీశ్‌రావు: మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు రెండు సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని తొందరపాటున ఒప్పుకొన్నామని, తప్పయిందని క్షమాపణ కోరండి. క్షమాపణ చెప్తే హుందాతనంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మీటింగ్‌ల ద్వారా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందనేది ప్రజలకు అర్థమైంది. ఈ తీర్మానంలో రెండు అంశాలపై అభ్యంతరం ఉన్నది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి కేటాయింపులు 299: 512 అంశంలో అన్యాయం చేసిందని, కేఆర్‌ఎంబీ అంశాన్ని తొలగించాలి. ఇక ఈ తీర్మానంలోని డిమాండ్లన్నీ కూడా గతంలో తాము పెట్టిన డిమాండ్లే. అనేకమార్లు మేం కేంద్రం ముందు పెట్టాం. ఇవేవీ కొత్తవేమి కావు.
ఉత్తమ్: హరీశ్‌రావు, కేసీఆర్ ఇరిగేషన్ శాఖలో లక్షల కోట్ల కాంట్రాక్టులు అప్పజెప్పి.. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేసి ఇప్పుడు మాట్లాడటం దారుణం. తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు ఎవరు ఒప్పుకొన్నారు? లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టిన తర్వాత కూలిపోయింది ఎవరి హయాంలో? జగన్మోహన్‌రెడ్డి ఎవరితో ఒప్పందం చేసుకొని కృష్ణా జలాలపై రాయలసీమ ప్రాజెక్టును కట్టారు? కేసీఆర్ క్షమాపణ చెప్పేవరకు బీఆర్‌ఎస్‌లో ఎవరూ మాట్లాడొద్దు.
హరీశ్‌రావు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి పంపకాన్ని 299:512కు ఒప్పుకొని రాష్ర్టానికి శాశ్వతంగా అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ పదే పదే చెప్తున్నారు. అయితే మినిట్స్‌లోని వాస్తవాలను చెప్పదలుచుకున్నాను. ఇది తాత్కాలికమైన ఒప్పందం మాత్రమేనని, భవిష్యత్తులో జరిగే ఒప్పందాలకు దీనికి సంబంధం లేదని మినిట్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 299 టీఎంసీలకు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. వారు చేసిన దుర్మార్గం, తప్పిదం వల్లే దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నీటి కేటాయింపులు 50:50 కావాలని మేం అడగలేదని చెప్తున్నారు. దీనికోసం 27 లేఖలు రాశాం. 2021 మే 24న రాసిన లేఖలోనూ పేర్కొన్నాం. పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. స్మితా సబర్వాల్ లేఖను సగమే రాశారు. ఆ తర్వాత ఆపరేషన్ ప్రొటోకాల్ పూర్తికాకుండా అప్పగించలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాహుల్‌బొజ్జా కూడా చెప్పారు. ఇలా ఆఫీసర్ల మీద నిందలేసుకుంటా ఎంతకాలం పని చేస్తారు.
తుమ్మలకు దీటైన జవాబు
హరీశ్‌రావు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో 2020 మే 5న వచ్చింది. ఆ జీవో రావడానికి ముందే పత్రికల్లో వచ్చిన వార్తలతో అప్రమత్తమై ఆ ప్రాజెక్టును ఆపాలని 2020 జనవరి 20న కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి లేఖ రాశాం. అనంతరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. జీఓ విడుదలైన వారంలోనే ప్రాజెక్టులను ఆపాలని 2020 మే 12న కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశాం. అక్రమ ప్రాజెక్టును ఆపాలని కేంద్రమంత్రి షెకావత్‌కు 2020 అక్టోబర్ 2న కేసీఆర్ లేఖ రాశారు.
ప్రాజెక్టులు అప్పగించి నానా తంటాలు: హరీశ్‌రావు
కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పి సంతకాలు పెట్టి ఇప్పుడు నానా తంటాలు పడుతున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 2005 డిసెంబర్ 19న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 44వేల క్యూసెక్కులకు పెంచిననాడు మీరంతా ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించారు. ఆరోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాకా కొట్లాడింది తామేనని, 40 రోజులు సభను స్తంభింపజేసినట్టు గుర్తుచేశారు. ఆనాడు సభలో సభ్యులుగా ఉన్నవారే నేడు మంత్రులుగా ఉన్నారని, ఆనాడు ఎవ్వరూ పెదవి విప్పలేదని దుయ్యబట్టారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే ఆర్డర్ వచ్చే వరకు వెంట పడ్డామని, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. ఆరు నెలల గడువులోగా సమస్య పరిష్కారానికి కృషిచేయాలనే అంశాన్ని తీర్మానంలో పొందుపర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరి పోరాడిండు
మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హరీశ్‌రావు దీటుగా సమాధానం ఇచ్చారు. ‘ఇది గాంధీభవన్ మీటింగ్ కాదు. సీఎం మాట్లాడిన మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొంత మంది తూలనాడుతున్నారు. ఉద్యమం అప్పటి నుంచి కూడా చాలా మంది సమైక్యవాదులు, వారి అడుగులకు మడుగులొత్తే వాళ్లు ఆయన్ను దూషించే ప్రయత్నం చేశారు. ఇవాళ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చునే అవకాశం లేదు. కేసీఆర్‌ను నిందిస్తే ప్రజలే బాధపడుతున్నారు. చాలా మంది మాకు ఫోన్ చేసి ‘సీఎం రేవంత్‌రెడ్డి భాష బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు’. తెలంగాణకు అవమానం జరిగితే తనకు అవమానం జరిగిందని భావించిన కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరి పోరాడిండు. ఎదురొడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిండు. పరిపాలనే చేతకాదని, తెలంగాణ చీకటవుతుందని, వ్యవసాయం చేయరాదని, నక్సలైట్ల రాజ్యమొస్తుందని శపిస్తే సుపరిపాలన అందించి, 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయించి రాష్ర్టాన్ని దేశానికి అన్నపూర్ణగా నిలిపారు’ అని పేర్కొన్నారు.
ఉత్తమ్‌కు కడియం కౌంటర్
కడియం శ్రీహరి: ఉమ్మడి ఏపీలో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేసిన అనుభవం ప్రకారం చెప్తున్నా. బచావత్ అవార్డులో ఏపీకి ఎన్‌బ్లాక్ 811 టీఎంసీలు కేటాయించినప్పటికీ ఫైనల్ ఆర్డర్‌లో ప్రాజెక్టులవారీగా కూడా కేటాయించారు. 811 టీఎంసీల్లో ఏపీలో ప్రాజెక్టులవారీగా ఎంత వినియోగం ఉన్నది? తెలంగాణలో ఎంత ఉందో లెక్కతీసి దీని ఆధారంగా ఏపీకి 512, తెలంగాణకు 299 కేటాయించారు. ఇది కేవలం వినియోగం ఆధారంగా చేసింది మాత్రమే. నీటి పంపకాల ఆధారంగా చేయలేదు. దీన్ని పట్టుకొని 299 టీఎంసీలు అంటూ రాద్ధాంతం చేస్తున్నారు.
కేంద్రం వద్దకు కేసీఆర్ స్వయంగా వెళ్లి..
పదేండ్లలో ఎంతో కష్టపడి ట్రిబ్యునల్‌ను తెచ్చుకున్నాం. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడితే 2014 జూలై 14న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రం వద్దకు వెళ్లి కృష్ణా నదీ జలాలను పునపంపిణీ చేయాలని, సెక్షన్-3 ప్రకారం ఇది తమ రాష్ట్రహక్కు అని లేఖ ఇచ్చారు. కేంద్రం ఏడాదిన్నర అయినా పట్టించుకోకుంటే పార్లమెంటు చట్టం ప్రకారం మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో సైతం కేసీఆర్ గట్టిగా వాదించారు. సుప్రీం కోర్టు కేసు వాపస్ తీసుకుంటే ట్రిబ్యునల్‌కు రెఫర్ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో కేసును ఉపసంహరించుకొని సెక్షన్-3ప్రకారం మళ్లీ కేంద్రం వద్ద పిటిషన్ పెట్టాం. కృష్ణా జలాల్లో ప్రాజక్టులవారీగా నీటి కేటాయింపులు చేయాలని అనేక లేఖలు రాశాం. ఎనిమిది-తొమ్మిదేండ్ల నిరంతర ప్రయత్నాల తర్వాత 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేస్తూ గెజిట్‌ను పబ్లిష్ చేసింది. 811 టీఎంసీలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2004లో ప్రారంభమైతే ఇప్పటికీ కొనసాగుతున్నది. ట్రిబ్యునల్ ద్వారా ఆరు నెలల గడువులోగా నీటి కేటాయింపులు పూర్తిచేయాలని తీర్మానంలో పెట్టాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైన వాదనలు వినిపిస్తే నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉన్నది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేశారు.
ఏపీ వాడుకొన్నది గోదావరి జలాలే: హరీశ్‌రావు
ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కానీ తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగనియ్యబోనని తెగించి కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని తీసుకునేందుకు సహకరిస్తామని మాత్రమే ఏపీకి కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఇందులో మన రాష్ట్ర ప్రయోజనం కూడా ఉన్నదని, వారు గోదావరి నీటిని తీసుకుంటే కృష్ణా నీటిలో మనం నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు, సాగర్‌కు ఎక్కువగా తెచ్చుకునే అవకాశం ఉంటదనే ఉద్దేశంతోనే వారికి సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు.
భట్టికి గట్టి సమాధానం
హరీశ్‌రావు: మొత్తానికి వాళ్ల తప్పిదాన్ని ఓ అధికారిపైకి నెట్టేసి.. వారిని వారు కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈఎన్సీ మాట్లాడింది తప్పయితే ఆయన మాట్లాడిన మరుసటి రోజే మంత్రో లేక మరెవరో ఖండించాలి. కానీ అప్పుడు ఖండించకుండా ఈరోజు వాస్తవాలు బయటపెడితే వాటిని అధికారిపైకి నెట్టేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి మీటింగ్, రెండో మీటింగ్ మినిట్స్‌ను చూపించాను. కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను చూపించాను. వీడియోను కూడా చూపించాను. అప్పుడు మీరు మేల్కొన్నారు.
భట్టి విక్రమార్క: కృష్ణా జలాలపై ప్రభుత్వం పెట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తారా? లేదా?
హరీశ్‌రావు: ఒకే విషయం ఖుల్లం ఖుల్ల. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ రోజు చర్చను పక్కన పెట్టి తీర్మానాన్ని ప్రవేశపెట్టారంటే అది నల్లగొండ సభ పుణ్యమే. కేసీఆర్ గొంతు విప్పడం వల్లే. ఇది బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయం. ఇక క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనే. చేసిన తప్పును క్షమించాలని కోరి తీర్మానం పెట్టినందుకు సంతోషం. తీర్మానంలో గత ప్రభుత్వం అనే పదాన్ని తీసేస్తే సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం.
రాహుల్‌గాంధీని కూడా చెప్పుతో కొట్టినట్టేనా?
నల్లగొండలో 11 సీట్లలో బీఆర్‌ఎస్‌ను ఓడించిన ప్రజలు చెప్పుతో కొట్టారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. అలా అయితే అమేథీలో ఓడిపోయిన రాహుల్‌గాంధీని కూడా అక్కడి ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, పదేండ్లపాటు సీఎంగా చేసిన వ్యక్తిని పట్టుకొని అలాంటి నీచమైన భాష మాట్లాడటం తగదని అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
రేవంత్ హుందాగా ఉండటం నేర్చుకో…
అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేలా రన్నింగ్ కామెంటరీ చేశారు. అలా నాలుగైదు సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రిగారూ మాట్లాడుతారా? నేను కూర్చోవాలా? ఎందుకు అలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు? మీరు సీఎం.. లీడర్ ఆఫ్ ది హౌజ్! ఎందుకలా మాట్లాడుతారు? హుందాగా ఉండటం నేర్చుకోండి’ అంటూ హితవు పలికారు.
కింది ఫొటో సోమవారంనాటిది. సాగర్‌పై పదేండ్లుగా కనిపించని సీఆర్పీఎఫ్ పోలీసులు ఇప్పుడెందుకు పహారా కాస్తున్నారు? కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే.. కేంద్ర బలగాలు ఎందుకున్నాయి?
ఇది కనిపించే సాక్ష్యం!
కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించకపోతే.. బడ్జెట్‌పై చర్చను పక్కకునెట్టి మరీ అసెంబ్లీలో చర్చపెట్టి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది?
ఇది కనిపించని సాక్ష్యం!
ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నది రేవంత్ సర్కార్. ప్రాజెక్టుల పరాధీనంపై కేసీఆర్ యుద్ధభేరి మోగించగానే, నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ పెట్టగానే ప్రభుత్వానికి దడ మొదలైంది. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా కేఆర్‌ఎంబీపై తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నది. తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే.. అధికారులను బీఆర్‌ఎస్ ఏజెంట్లు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకుని కాంగ్రెస్ సర్కార్ పడుతున్న ఆపసోపాలకు అద్దంపడుతున్నది.
నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.. 3 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా నీళ్లేవో, నిజాలేవో తేలిపోయాయి. కృష్ణాలో నిండా మునిగిన రేవంత్ సర్కారు.. మాజీమంత్రి హరీశ్ వేసిన ప్రశ్నలకు, ఇచ్చిన కౌంటర్లకు నీళ్లు నమలడం తప్ప ఏమీ చేయలేకపోయింది.హరీశ్ సారథ్యంలో తెలంగాణ జన విజయమిది. ఇన్నాళ్ల తెలంగాణ నష్టాలకు, కష్టాలకు కారణం పాపాలభైరవి కాంగ్రెస్సే అని ఇవ్వాళ సభ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది.హరీశ్ కౌంటర్ అటాక్
సభలోఎంతసేపైనా మాట్లాడుతం..
మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు. మొత్తం ప్రిపేర్ అయ్యే వచ్చినం. రాత్రి 12 వరకైనా మేం సిద్ధంగా ఉన్నాం. బట్టలు, సద్ది కూడా తెచ్చుకున్నం.
బీపీ లేసినట్టు ఉన్నది.. బయటకు పొయ్యి ఓ గోలేసుకొని రా వెంకన్న (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి). ఉన్నదంటే ఉలుకెందుకు? ఓపిక పట్టు భట్టన్నా.. నువ్వు ఉప ముఖ్యమంత్రివి కొంచెం ఓపిక తెచ్చుకో.రేవంత్‌రెడ్డిలాంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటది.రేవంత్‌రెడ్డీ.. కొడంగల్ ప్రజలు తరిమితేనే మాల్కాజిగిరికి వచ్చినవా? నువ్వెందుకు వచ్చినవ్? మీరు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మిమ్మల్నే చూపిస్తయ్.ఓడలు బండ్లు అవుతయి. బండ్లు ఓడలవుతయి. గతంలో నల్లగొండలో 12 సీట్లకుగానూ కాంగ్రెస్‌కు ఉన్నవి సున్నా. మరువొద్దు.