TRINETHRAM NEWS

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం

వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందన్న గోరంట్ల

ఏ వాగ్దానం చూసినా మోసమేనన్న గోరంట్ల

అంకెల గారడీ తప్ప మరేమీ లేదని విమర్శలు

శివ శంకర్. చలువాది

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా అబద్ధాలు చెప్పలేక గవర్నర్ నాలుగు గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందని వ్యంగ్యం ప్రదర్శించారు.

రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా, తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి… మరి ఏం సాధించారని గొప్పలు చెప్పుకుంటున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు సొంత రంగులు వేసుకుని బుకాయించడం తప్ప మీరు చేసిందేమిటి? అని నిలదీశారు.

ఎక్కడ చూసినా జగనన్న, వైఎస్సార్ అనే పేర్లు, పార్టీ రంగుల పిచ్చ తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏదని అన్నారు. అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి మహనీయుల పేర్లను తీసేసి సొంత పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల కల్పన, ఉపకారవేతనాల చెల్లింపు… ఇలా ఏ వాగ్దానం చూసినా మోసమేనని గోరంట్ల విమర్శించారు. ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు… వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ఆటోడ్రైవర్లు ఎంతమంది? నువ్వు ఇచ్చింది ఎంత? అని సీఎం జగన్ ను నిలదీశారు.

“వాహనమిత్ర ఆర్థిక సర్వే ప్రకారమే రాష్ట్రంలో 12.86 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు. దాంట్లో 2.78 లక్షల మందికి మాత్రమే నువ్వు రూ.10 వేలు ఇచ్చావు. పెట్రోల్ ధరలు పెంచేశావు, డీజిల్ ధరలు పెంచేశావు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచేశావు. రాష్ట్రంలో 31 లక్షల మంది నేతన్నలు ఉన్నారు. నేతన్న నేస్తం కింద 81 వేల మందికి మాత్రమే ఇచ్చావు. కేంద్రం వారికి ఇచ్చే సబ్సిడీలు అన్ని ఎగ్గొట్టేశావు.

ఇక చేదోడు పథకంలోనూ అంతే… రాష్ట్రంలో 13 లక్షల మందికి పైగా టైలర్లు ఉన్నారు, 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. 28.63 లక్షల మంది రజకులు ఉన్నారు. కానీ చేదోడు కింద జగన్ 3.25 లక్షల మందికి రూ.10 వేలు ఇచ్చాడు. ఎలా ఎంతమందిని దగా చేశావు? ఇది అంకెల గారడీ కాక మరేమిటి?” అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.