TRINETHRAM NEWS

ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి.. రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా… ట్రాన్స్ జెండర్ !

19 ఏళ్ల క్రితం ఎర్నాకుళంలో రైల్వేలో చేరిన సింధు

ఇటీవల తమిళనాడులోని దిండుక్కల్‌కు బదిలి

అక్కడ పనిచేస్తూనే టికెట్ ఇన్పెక్టర్‌గా శిక్షణ

తాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టీసీగా నియామకం

దక్షిణ భారతదేశంలో తొలి రైల్వే టికెట్ ఇన్‌‌స్పెక్టర్‌గా రికార్డు

ఇటీవలి కాలంలో హిజ్రాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను తమను తాము నిరూపించుకునే క్రమంలో ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ హిజ్రా రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. తమిళ సాహిత్యంలో బి.లిట్ చేసిన నాగర్‌కోవిల్‌కు చెందిన సింధు 19 ఏళ్ల క్రితం కేరళలోని ఎర్నాకుళంలో రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత బందిలీపై తమిళనాడులోని దిండుక్కల్ వచ్చారు. ఓ ప్రమాదంలో ఆమె చేయికి తీవ్ర గాయం కావడంతో ఆమెను వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తూనే ఆమె టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. దీంతో ఆమెను తాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. గురువారం సింధు బాధ్యతలు స్వీకరించారు. ఫలితంగా దక్షిణ భారతదేశంలో తొలి రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. తాను హిజ్రా కావడంతో ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి ఈస్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని జ్ఞాపకమని సంతోషం వ్యక్తం చేశారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమను ఆయుధాలుగా చేసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.