నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!
Trinethram News : Telangana : సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ పొందుతున్న ఈయన.. చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ మృతితో.. రాజకీయ నాయకులు, అయన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. కొన్నాళ్లుగా నిమ్స్ లో చికిత్స పొందుతన్న ఈ సీనియర్ రాజకీయ నేత.. త్వరగా కోలుకుంటారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ.. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
మందా పుల్లయ్య, మందా సవరమ్మ దంపతులకు జన్మించిన జగన్నాథం.. తల్లిదండ్రులిద్దరు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ చదివించారు. సామాన్య మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈయన.. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే రోజూ సాయంత్రం వేళ క్లబ్ హిల్ కాలనీలో టెన్నిస్ బాల్ పికప్ బాయ్‌గా పనిచేశారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వేసవి సెలవుల్లో నాగార్జున సాగర్ డ్యామ్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో వాటర్ బాయ్‌గా పని చేసి చదువుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చదువుకున్న జగన్నాథం.. ఆర్థిక ఇబ్బందుల్ని చాలా ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు.. వేసవి సెలవుల్లో రోజుకు 0.50 పైసల రోజువారీ కూలీగా నాగార్జున సాగర్ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేశారు. ఇలా.. ఎంత కష్టపడినా ఆయన చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువుకుంటూ.. ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పట్టుదలగా చదివి ఎప్పుడూ చదువుల్లో మొదటి స్థానంలో నిలిచే వారు.
నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదివిన జగన్నాథం.. 6 నుంచి 8వ తరగతి వరకు నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలోని హైస్కూల్లో విద్యనభ్యసించారు. 9, 10వ తరగతులు వరంగల్ జిల్లా సంగంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో కొనసాగించారు. వికారాబాద్‌లోని జెడ్పీ హైస్కూల్లో H.S.C చదివిన జగన్నాథం.. హైదరాబాద్ నిజాం కళాశాలలో P.U.C అభ్యసించారు.
ఆ తర్వాత ఎం.బి.బి.ఎస్ కోర్సులో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరారు. అక్కడ ఎమ్ఎస్ డీఎల్ఓ, ఈఎన్ టీ స్పెషలిస్ట్ సర్జన్ కోర్సు పూర్తి చేశారు. సూర్యాపేటలోని సివిల్ హాస్పిటల్లో అసిస్టెంట్‌గా పనిచేసిన ఈయన.. ఆ తర్వాత 8వ బెటాలియన్ APSPలో పోలీస్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో, హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రిలో ఈఎన్టీ సర్జన్‌గా సేవలందించారు.
1996లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసిన మందా జగన్నాథం.. తొలి పోరులోనే విజయం సాధించారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996 లో లోక్‌సభకు టీడీపీ తరఫున ఎన్నిక కాగా, 1999, 2004 లలోనూ టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఈ రాజకీయ నేత, 2014 – తెరాస పార్టీ నుండి పోటీ చేసి కారు గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి కారణంగా సల్ప మెజారిటీతో ఓటమి పాలైయ్యారు. దాంతో.. 2018లో దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినేట్ హోదాతో నామినేట్ పదవి నిర్వహించారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఈ నేత.. ప్రజా నాయకుడిగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితం.
వైద్యుడిగా, రాజకీయ నేతగా విభిన్న రంగాల్లో రాణించిన మందా జగన్నాథం మృతిపై.. వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాథం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు.
జగన్నాథం మృతి పట్ల ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సంతాపం వ్యక్తం చేయగా.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పలుసార్లు ఎంపీగా విజయం సాదించిన మంద జగన్నాథం తెలంగాణ పోరాటంలో క్రియాశీలకంగా పని చేసారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App