TRINETHRAM NEWS

For the first time in AP, High Court PP post for BC

Trinethram News : అమరావతి

రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన న్యాయవాది రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా నియమితులయ్యారు. న్యాయవాది మెండ లక్ష్మీనారాయణను పీపీగా నియమిస్తూ న్యాయశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సునీత బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో ప్రాసిక్యూషన్లు, క్రిమినల్‌ కేసుల అప్పీళ్ల విచారణ, తదితర కేసుల్లో పీపీ హోదాలో లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చూసినా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఈ పదవిలో నియమించడం ఇదే తొలిసారి.

గతంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యున్నతస్థాయి పోస్టుల భర్తీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన తెదేపా ప్రభుత్వం.. ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది.

పోలినాటి వెలమ(బీసీ) సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణను కీలకమైన పోస్టులో నియమించడమే అందుకు నిదర్శనం.
వ్యవసాయం కుటుంబం నుంచి

♦️లక్ష్మీనారాయణది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చిన్నతుంగం పంచాయతీ పరిధిలోని కృష్ణచంద్రాపురం. తల్లిదండ్రులు తవిటమ్మ, కృష్ణమ్మ. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన లక్ష్మీనారాయణ

టెక్కలిలో డిగ్రీ, విజయనగరం లో బీఈడీ, ఆంధ్ర వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, నాగార్జున వర్సిటీలో ఎమ్మెస్సీ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.

2009లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు.

2014-19 మధ్య ప్రత్యేక సహాయ పీపీగా పనిచేశారు.
మరో 14 మంది ఏజీపీల నియామకం

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు తాజాగా మరో 14 మంది న్యాయవాదులను సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జులై 3న 14 మందిని నియమించిన విషయం తెలిసిందే.

మొత్తం 28 ఏజీపీలలో 17 (61%)మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం.

♦️ఏజీపీలుగా తాజాగా నియమితులైన వారిలో మొర్తా శ్రీనుబాబు, సీహెచ్‌.శాంసన్, సంధ్యదీప్తి, మేకల అనూష, షహీన ఖాతూన్, ఆర్‌.సూర్యనారాయణ, కొరిబిల్లి సందీప్, తుంగల రఘుప్రసాద్, ఆర్‌ఎస్‌ మణిధర్‌ పింగళి, జె.కృష్ణ ప్రణీత్, అరువ రఘురాం, శ్రీనివాస్‌ పాతూరి, అప్పసాని వినీత్, కాటా సాంబశివరావు ఉన్నారు.
ఏజీపీలకు నెలకు రూ.44 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరు ఏజీ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మూడేళ్లు పోస్టులో కొనసాగుతారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

For the first time in AP, High Court PP post for BC