Congress Six Guarentees Comment : ఆరు గ్యారెంటీలు అమలయ్యేనా..ఖజానాకు పెను భారం ..ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇవే ఓట్లు కొల్లగొట్టేలా చేసింది. 64 సీట్లతో అధికారంలోకి వచ్చినా దినదిన గండం అర్ధాయుష్షు అన్నట్టుగా తయారైంది పార్టీ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి , కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రంగంలోకి దిగారు. పాలనా పరంగా దూకుడు పెంచారు. ప్రభుత్వ పరిధిలోని శాఖలను సమీక్షించడం మొదలు పెట్టారు. ఏ శాఖ చూసినా అవినీతికి కేరాఫ్ గా మారడంతో దిక్కు తోచని స్థితి నెలకొంది. అంచనాలకు మించి నాలుగున్నర కోట్ల ప్రజానీకంపై భారం పడనుంది. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని నీళ్లలా పారించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విస్తు పోయేలా చేసింది. అంతే కాదు సలహదారుల పేరుతో భారీ ఎత్తున ఖర్చు చేశారు.
ప్రగతి భవన్ ను అంచనాలకు మించి ఖర్చు చేశారు. లెక్కలేనంతగా లూటీ చేశారన్న ఆరోపణలు లేక పోలేదు. తమ వారికి లబ్ది చేకూర్చేలా మాజీ సీఎం కేసీఆర్ , మంత్రివర్గం పకడ్బందీగా ప్లాన్ చేసిందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజా సంఘాలు, నేతలు, మేధావులు, బుద్దిజీవులు ఆరోపించారు. అంతే కాదు రైతు బంధు, పెన్షన్ల పేరుతో ఉన్నోళ్లకు లబ్ది చేకూరేలా ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ప్రజలు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో తెలంగాణలో లూటీ తప్ప చేసింది ఏమీ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం కాగా ఉన్నతాధికారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇక సర్కార్ భూములకు కన్నం వేసేందుకు ధరణిని తీసుకు వచ్చిన గులాబీ దళం అందినంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంది. కబ్జాలకు పాల్పడింది.
ఈ తరుణంలో ఆరు గ్యారెంటీల పేరుతో కొలువు తీరిన రేవంత్ సర్కార్ కు ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం , ఆరోగ్య శ్రీ కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. నిరుద్యోగులకు భృతి, వృద్దులకు పెన్షన్లు, పేదలకు ఇళ్ల నిర్మాణం, జాగా ఉంటే రూ. 5 లక్షలు , ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయడం సవాల్ గా మారింది. ఇక బాధ్యత కలిగిన ఐఏఎస్ లు, ఐపీఎస్ ల అక్రమార్జనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రకంగా రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాక మొత్తం అప్పు ఏకంగా రూ. 5,20,000 కోట్లకు పైగా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ఇవన్నీ అమలు కావాలంటే గణనీయంగా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది.